‘గ్రేటర్’ కోసం కేసీఆర్ ‘గ్రేట్’ ప్లాన్..!

kcr
వరుస వలసలతో ఊపుమీదున్న అధికార పార్టీ టీఆర్ఎస్ ఎలాగైనా గ్రేటర్ పీఠంపై పాగ వేసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ తో ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేస్తున్న టీఆర్ఎస్.. గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ పక్కా వ్యూహంతో వెళుతోంది. తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో బలంగా మారిన టీఆర్ఎస్ గ్రేటర్ పై గులాబీ జెండా ఎగరేయకపోతే తమకు సిగ్గు చేటుగా ఉంటుందని భావిస్తున్న సీఎం కేసీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై భారీ కసరత్తులు చేస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల కోసం తొందరపడి రంగంలోకి దూకకుండా.. కరెక్ట్ టైమ్ కోసం వేచిచూస్తోంది. అంతా సెట్ రైట్ అయ్యాకే జీహెచ్ఎంసీ బరిలోకి దూకాలని ప్లాన్ చేస్తోంది. దీనికోసం అవసరమైతే.. ఎలక్షన్స్ వాయిదా వేసే విషయంపైనా ఆలోచనలు చేస్తోంది. ఈలోపు జంటనగరాల్లో భారీ హామీలు గుప్పిస్తూ, జరిగే పనులు వేగవంతం చేస్తూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు.

నిజానికి డిసెంబర్ మొదటి వారంతోనే జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగిసింది. గడువుకు ముందే ఓటర్ల లెక్కింపు పూర్తిచేసి.. రిజర్వ్ డ్ స్థానాలను ప్రకటించాలి. కానీ ఇంతవరకు అతీగతీ లేదు. జనాభా పరంగా.. గ్రేటర్ లో డివిజన్ల సంఖ్యను 175 కు పెంచాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అది కూడా ఇంకా పూర్తి కాలేదు. విభజన ఆధారంగా డివిజన్లలో పట్టుకోసం.. మాజీ కార్పొరేటర్లు, స్థానిక నేతలకు గాలం వేస్తూ.. బలపడేందుకు ట్రై చేస్తోంది టీఆర్ఎస్. సిటీలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే భూముల క్రమబద్దీకరణతో.. స్లమ్స్ లోని పేదలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలకు తెరలేపారు. మెట్రోపై కాన్సంట్రేట్ చేసి సీఎం.. పనుల్లోనూ వేగం పెంచాలని ఎల్ అండ్ టీ అధికారులను ఆదేశించారు. పనులు వేగంగా జరిగేందుకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మొత్తానికి జంటనగరాల్లో అన్ని పరిస్థితులు అనుకూలంగా మారిన తరువాతే.. ఎన్నికల రణరంగంలోకి దూకాలని గులాబీ దళపతి భావిస్తున్నారు.

Comments