రేప్‌కు మతంలేదు: న్యాయవాది దీపిక

బాధితురాలి తరపున న్యాయ పోరాటం చేస్తున్న కశ్మీరీ పండిట్ :
లైంగికదాడి వంటి దారుణమైన నేరాలకు మతం లేదని న్యాయవాది దీపికా తుసూసింగ్ (38) చెప్పారు. కతువాలో లైంగికదాడి, హత్యకు గురైన ముస్లిం తెగ బాలిక తరఫున దీపిక న్యాయపోరాటం చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల తర్వాత 1986లో ఉత్తరకశ్మీర్ ప్రాంతాన్ని విడిచిపెట్టిన వేలాది హిందూ కుటుంబాల్లో దీపిక కుటుంబం కూడా ఉంది. కతువా ఘటనలో జమ్మూ హైకోర్టులో దీపిక రిట్‌పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాతే రాష్ట్రప్రభుత్వం విచారణను స్థానిక పోలీసుల నుంచి క్రైమ్‌బ్రాంచ్‌కు మార్చింది. మొదటిసారిగా పేపర్లలో వార్త చూసినప్పుడు ఏదో తేడాగా అనిపించింది. మృతదేహం అడవిలో నాలుగురోజుల తర్వాత దొరికితే, దుస్తులపై ఎలాంటి మరకల్లేకపోవడం సందేహాల్ని రేకెత్తించింది. పైగా వారిది చదువులేని నిరుపేద కుటుంబం. అన్నింటికిమించి నాకూ ఐదేండ్ల పాప ఉంది. ఆమె కూడా నాబిడ్డలాంటిదే అనిపించింది. అందుకే వారి తరఫున పోరాడాలనుకున్నాను అని చెప్పారు. అయితే ఆమెకు న్యాయవాదుల నుంచే బెదిరింపులు రావడం మొదలైంది. ఈ కేసులో న్యాయవాదులు విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించడాన్ని దీపిక తీవ్రంగా తప్పుపట్టారు. నిందితులకు మద్దతుగా నిర్వహించిన ప్రదర్శనలో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయడం సిగ్గుచేటని ఆమె అన్నారు. చిన్నపిల్లపై గ్యాంగ్‌రేప్ హృదయాల్ని కరిగించే ఘటన. ఇలాంటి దారుణాలకు మతం ఉండదు అని చెప్పారు. న్యాయవాదుల మాట వినకుండా కేసును చేపట్టినందుకు తనపై బురద చల్లుతున్నారని, దేశవ్యతిరేకిగా, హిందూ వ్యతిరేకిగా ముద్రవేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. నిందితులు నిజంగా నిర్దోషులైతే న్యాయవాదులు కోర్టుకు వచ్చి వాదించమనండి. డ్రామాలు బయటపడుతాయని తెలుసు కాబట్టే, రోడ్లపై ఆందోళనలకు దిగుతున్నారు అని దీపిక పేర్కొన్నారు.

దారుణాన్ని వెలికి తీసిన రమేశ్

కథువా ఉదంతంపై దర్యాప్తు పూర్తి చేసిన జమ్ముకశ్మీర్ క్రైం బ్రాంచి సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ రమేశ్ జెల్లాపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఎన్నో అవరోధాలు, ఒత్తిడులు ఎదురైనా ఎదుర్కొని ఆయన ఈ కేసు దర్యాప్తు చేసి స్థానిక మెజిస్ట్రేట్‌కు చార్జిషీట్‌ను సమర్పించారు. ఆ చిన్నారి కిడ్నాప్ ఎలా జరిగింది, దుండగులు తరువాత సామూహిక లైంగిక దాడి చేసి ఆమెను ఎలా హత్య చేశారన్న వివరాలు మెజిస్ట్రేట్‌కు తెలియజేశారు. కేసు దర్యాప్తునకు హైకోర్టు 90 రోజుల గడువు విధించినా రమేశ్ జెల్లా పది రోజుల ముందే ఆ పని పూర్తి చేశారు. దీంతో కేసు విచారణ జరిగి దోషులకు శిక్ష పడే అవకాశాలు ఏర్పడ్డాయి. కశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన రమేశ్ జెల్లా 1984లో పోలీస్ విభాగంలో చేరారు. ఉత్తమ సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఉగ్రవాదులతో పోరాడినందుకు ఆయనకు గతంలో రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది.

Comments