రాజకీయం స్నేహం ఒక్కటి కాదన్న రజినీ: కమల్

తమిళ నాట రాజకీయాలు అక్కడి ప్రజలలో తీవ్ర ఆసక్తిని పెంచుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ సంవత్సరం అక్కడి ప్రముఖ నటులు రజనికాంత్, కమల్ హాసన్ లు పార్టీ లు పెట్టడమే. ఓ వైపు రజని, మరోవైపు కమల్ తమ తమ పార్టీల ప్రకటన, స్థాపన పనుల నిమిత్తం ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు, అలానే త్వరలో ఇద్దరు కూడా రాష్ట్ర టూర్ లు చేయనున్నట్లు తేలుతోంది. అయితే ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న కమల్ అక్కడి హార్వర్డ్‌ యూనివర్శిటీలో మీడియాతో ముచ్చటించారు. ప్రతిఒక్కరికి సమన్యాయం జరగాలనే తలంపుతోనే తాను రాజకీయ పార్టీ నెలకొల్పుతున్నానని, నేను ప్రజల మనిషిని అన్నారు. ప్రజలతో కలిసి నడిచేందుకే పార్టీని ప్రారంభిస్తున్నానని, అంతేతప్ప రాజకీయ నాయకులతో కలిసి పనిచేసేందుకు కాదని పేర్కొన్నారు. రజని పొలిటికల్ ఎంట్రీ పై మీ స్పందన తెలియజేయమనగా మేమిద్దరం కలిసి చిత్రాలలో నటించాం, మంచి స్నేహితులం కూడా అన్నారు. అయితే స్నేహం వేరు, రాజకీయాలు వేరన్నారు.

వాస్తవానికి ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒక్కటే, అయితే ఆయనతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. రజనీ రాజకీయ రంగు కాషాయం (బీజేపీ) కాదని భావిస్తున్నానాని ఒకవేళ అదే జరిగితే ఆయనతో కలిసి పనిచేయడం జరగదు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తారా అన్న ప్రశ్నకు అటువంటి ఉద్దేశం తనకు లేదన్నారు. ఒకవేళ తన పార్టీకి సరైన మెజార్టీ రాకపోతే అది ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించి, ప్రతిపక్షంలో కూర్చుంటానని అన్నారు. అదే సమయంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే తన సమయం వచ్చే వరకూ వేచి చూస్తానని తెలిపారు. అయితే ఈనెల 21వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలం స్వస్థలం రామేశ్వరం నుండి తన రాజకీయపర్యటన ఉంటుందని, అప్పుడే పార్టీ కి సంబందించిన అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు…..

Comments