మోదీపై కమల్ ఫైరింగ్ లెటర్
కావేరీ జలవివాదంతో తమిళనాడు అట్టుడుకుతోంది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నినదిస్తున్నారు. రైతులు కంటిపై కునుకు లేని పరిస్థితిలో ఉన్నారు. ఓవైపు నదీజలాల పంపిణీపై సుప్రీంలో స్పష్టమైన తీర్పు ఉన్నా కర్నాటక ఎన్నికల వేళ తమకు ఫలితం ప్రతికూలంగా మారకుండా భాజపా-ఎన్డీయే అధిష్ఠానం ఈ వ్యవహారంపై కిమ్మనకుండా ఉంది. దీనిని తమిళ ప్రజలు నిలదీస్తున్నారు. వీళ్లకు కమల్ హాసన్ సహా తమిళ సినిమా పరిశ్రమ యావత్తూ మద్ధతు పలికింది.
నేడు ప్రధాని మోదీపై సీరియస్ అవుతూ కమల్ ఓ బహిరంగ లేఖను రాశారు. గౌరవనీయులైన మోదీగారికి విన్నపం.. అని మొదలుపెట్టిన కమల్ ప్రధానిపై ఓ రేంజులో విరుచుకుపడ్డారు. సుప్రీం తీర్పు వచ్చినా, మీ తాత్సారం వెనక అర్థం ఏమిటి? నిజాయితీని నిరూపించుకోండి అంటూ సవాల్ విసిరారు కమల్. నర్మదా జలాల వివాదంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చూసిందే ఇప్పుడు చూస్తున్నారు. మీ అనుభవం దృష్ట్యా ఈ సమస్యను ఒక దేశ ప్రధానిగా పరిష్కరించండి అని కమల్ సూచించారు. సుప్రీం తీర్పు వెలువరించినా ఇంకా తాత్సారం చేస్తుంటే జనం మిమ్మల్ని సందేహిస్తున్నారని దుయ్యబట్టారు.