జగన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటున్న టీడీపీ నేత!

వైసిపి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అక్కడి సభలో మాట్లాడిన జగన్ నూతన రాజధాని అమరావతిని, అలానే ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజక్టు అయిన పోలవరాన్ని రెండు రకాల సినిమాలతో పోల్చడం అయన అహంకారాన్ని తెలియచేస్తుందన్నారు రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, అతనికి అసలు రాష్ట్ర సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేదని మండిపడ్డారు. తండ్రిని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచేసిన జగన్ కు ఇంతకన్నా ఏమి తెలియదని విమర్శించారు.

ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకపోతే తదనంతర పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలను వైసిపి, బీజేపీ, జనసేన పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని, ఓవైపు సీఎం చంద్రబాబు తనవంతుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే ఆయనపై, టిడిపి పై ప్రత్యారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా ప్రధాని మోడీకి సమర్పించిన వినతిపత్రంలో ఏపీకి ప్రత్యేకహోదా అనే అంశాన్ని ఎందుకు పొందుపరచలేదో చెప్పాలని, ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకొచ్చి బిల్లు కూడా ప్రవేశ పెట్టిందని, అయితే అది ప్రస్తుతం కేంద్రం వద్ద ఉందని, వారి నుండి అనుమతి వస్తే తక్షణమే దానిని అమలుజరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందని అన్నారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు గొప్ప వ్యక్తిగా పవన్ కు కనపడ్డారు. ఎప్పుడైతే ఎన్డీఏ నుండి తాము బయటకి వచ్చామో అప్పటినుండి పవన్ టిడిపి నేతలపై కక్షగట్టి బిజెపి ఇచ్చిన స్క్రిప్ట్ ని చదువుతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి రాష్ట్రాలను అణచి కేంద్రంలో నిధులను తమ పార్టీవారికి తరలిస్తోంది, రాష్ట్రాలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అనే విషయాన్నీ బిజెపి నేతలు, ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎన్నో కష్టాల మధ్య విడిపోయి ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఏపీని నిధులిచ్చి అన్నివిధాలా ఆడుకోవలసింది పోయి అబద్దపు, మోసపూరితంగా వ్యవహరించడం తగదని అన్నారు. మోడీ ఇకనైనా తన నియంతృత్వ పోకడలు, విధానాలకు స్వస్తి చెప్పి రాష్ట్రాల సమస్యల గురించి ఆలోచిస్తే మంచిది అని అన్నారు……

Comments