ప్రచురణ తేదీ : Nov 8, 2017 3:13 PM IST

పారడైజ్ పేపర్స్ లో ఎందుకు తన పేరు వచ్చిందో జగన్ చెప్పేశాడు !

ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర మూడవ రోజుకు చేరుకుంది. కడప జిల్లాలో కొనసాగుతున్న పాదాయాత్రలో జగన్ వైసిపి కార్యకర్తలను ఉత్సాహపరిచేలా ప్రసంగాలు చేస్తున్నారు. చంద్రబాబు హామీలు ఇచ్చి నెరవేర్చని అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడవ రోజు పాదయాత్రలో ప్రసంగించిన జగన్.. బాబు హామీ ఇచ్చిన రుణమాఫీ ఎవరికైనా అమలైందా అని ప్రజల్ని ప్రశ్నించారు. జనం నుంచి లేదని స్పందన రావడంతో..తాను ఎక్కడికి వెళ్లి అడిగినా ప్రజలంతా ఇలాగే అంటున్నారని జగన్ చేతులు తిప్పుతూ చూపించడం విశేషం.

తాజాగా సంచలనం సృష్టిస్తున్న పారడైజ్ పేపర్స్ విషయంపై జగన్ ప్రజలకు ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది. తాను ఏ గొప్ప పని ప్రారంభించినా విషం కక్కేందుకు సిద్ధంగా టీడీపీ ఉంటుందని జగన్ అన్నారు. ఎక్కడో వచ్చిన పారడైజ్ పేపర్స్ ని నాతో లింక్ చేసి కొత్త పుకార్లులు సృష్టిస్తున్నారని జగన్ అన్నారు. తాను పాదయాత్ర ప్రారంభించిన రోజునే ఇలా జరిగిందంటే ఇందులో దాగి ఉన్న కుట్రని అర్థం చేసుకోవాలని జగన్ అన్నారు. ఇదంతా చంద్రబాబు అనుకూల మీడియా చేస్తున్న హంగామా మాత్రమే అని ఆరోపించారు. అందులో వచ్చినట్లుగా తనకు విదేశాల్లో ఆస్తులు ఉంటె రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఈ విషయాన్ని 15 రోజులలోపు నిరూపించకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

Comments