ప్రచురణ తేదీ : Jan 25, 2017 8:20 AM IST

నేను చేసిన తప్పుకు రజనీకాంత్ తనపై నింద వేసుకున్నారన్న హృతిక్

hrithik-rajinikanth
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజాగా నటించిన చిత్రం ‘కాబిల్’ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ చూసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్రైలర్ తనకు చాలా బాగా నచ్చిందని హృతిక్ రోషన్ కి ఒక ఉత్తరం రాశారు. దీనిపై స్పందించిన హృతిక్ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ నుండి అభినందనలు అందుకోవడం చాలా ప్రత్యేకమని, ఆయన మాటలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని హృతిక్ అన్నారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు తండ్రిలాంటి వారని అన్నాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన రజనీ పుట్టినరోజు కు ముందు రోజు రాత్రి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ రజనీ కి విషెస్ చెప్పడానికి ఫోన్ చేశారు. అప్పుడు ‘కాబిల్’ సినిమా చూడాలని ఎదురు చూస్తున్నా అని చెప్పారట. దాంతో రజనీ కోసం చిత్ర బృందం ప్రీమియర్ షో ఏర్పాటు చేస్తుంది. 1986లో రజనీకాంత్ నటించిన ‘భగవాన్ దాదా’ అనే హిందీ సినిమాలో హృతిక్ బాలనటుడిగా నటించాడు. ఈ సినిమాలో నటించేటప్పుడు హృతిక్ నటించిన చాలా సీన్లు రీటేక్ చేయాల్సి వచ్చేదట. ఆ సమయంలో రజనీ తప్పు తనవల్లే జరిగిందని, హృతిక్ ఏం తప్పు చేయలేదని నచ్చజెప్పేవారని హృతిక్ అన్నాడు. అప్పుడే ఆయన ఒక తండ్రిలా, స్నేహితుడిలా అనిపించేవారని, చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు అందరినీ రజనీ ఒకేలా చూస్తారని హృతిక్ చెప్పారు.

Comments