భాజాపా నుంచి నిధులు ఎలా రాబట్టాలి..?

గురువారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేసినందున కేంద్రప్రభుత్వం సాయంతో ఆంధ్రరాష్ట్రంలో అమలు కాబోతున్న ప్రాజెక్టులకు ఎలాంటి అవకతవకలు కలగకుండా చూసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ ముఖ్య నేతలతో తన నివాసంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మంత్రులు లోకేశ్, యనమల, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్‌, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులు.. రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. ప్రత్యేక హోదా, వివిధ హామీలపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే కేంద్ర నిధులు ఏ విధంగా రాబట్టుకోవాలనే కోణంలో ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగాయి. ఉపాధి హామీ వంటి పథకాల్లో బకాయిల కారణంగా పేద కూలీలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావనలో ఉంది. ఉపాధి హామీ బకాయిలకు రాష్ట్ర నిధుల నుంచే చెల్లింపులు జరపాలని ఇప్పటికే దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే తరహా ఇబ్బందులు మరికొన్ని వస్తే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో పడుతుందంటూ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో సీఎం తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక వీళ్ళు సమస్య పరిష్కారానికి తీస్కుంటున్న నిర్ణయాలు ఎంతవరకు దారి తీస్తాయో వేచి చూడాలి.

Comments