ప్రచురణ తేదీ : Dec 6, 2017 9:28 AM IST

రాజకీయ క్రీడలో నలిగిపోయిన విశాల్..!

నటుడు విశాల్ ఆర్కేనగర్ ఉపఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేయాలనుకున్నా ఆశలు ఆవిరైపోయాయి. అర్ధరాత్రి వరకు జరిగిన అంతుచిక్కని పొలిటికల్ డ్రామాలో పందెం కోడి నలిగిపోయింది. తన నామినేషన్ ని రిటర్నింగ్ అధికారి రిజెక్ట్ చేశారని తెలియడంతో విశాల్ ధర్నాకు దిగారు. నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తన నామినేషన్ ని అధికారులు తిరిగి స్వీకరించారని విశాల్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అలాంటిదేం లేదంటూ రాత్రి 11 గంటలకు విశాల్ నామినేషన్ ని రిజెక్ట్ చేసేశామని అందులో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడంతో విశాల్ రాజకీయ ఎంట్రీ ప్రస్తుతానికి కలగా మిగిలిపోయింది.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద నిన్న సాయంత్రం మొదలైన హై డ్రామా అర్థ రాత్రి వరకు కొనసాగింది. విశాల్ తో పాటు జయ మేనకోడలు దీప నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. విశాల్ అతనా అనుచరులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అరెస్టు వంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్ది సేపటి తరువాత విశాల్ తన నామినేషన్ ని అధికారులు స్వీకరించారని తెలియజేసారు. సత్యం గెలిచిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. తాము విశాల్ నామినేషన్ ని రిజెక్ట్ చేశామని ఎన్నికల అధికారి నుంచి వార్త రావడంతో అతడు కంగుతిన్నాడు. డిసెంబర్ 5, 2016 న అమ్మ మరణం.. డిసెంబర్ 5, 2017 న ప్రజాస్వామ్య మరణం.. అంటూ విశాల్ తన ఆవేదనని వ్యక్తం చేశాడు. దీనిపై విశాల్ కోర్టుని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Comments