అజ్ఞాతవాసికి అసలైన ఫ్రెండ్ ఆయనే..!

రెండు తెలుగు రాష్ట్రాలు, యుఎస్ లో ఎన్నారైలు సహా అంతా అజ్ఞాతవాసి ఫీవర్ తో ఊగిపోతున్నారు. మరికొద్ది సేపట్లోనే అజ్ఞాతవాసి తొలి ఆట మొదలు కాబోతోంది. పవర్ స్టార్ సినిమా ఎలాంటి రికార్డులు సాధిస్తుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. బాహుబలి స్థాయిలో రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో కొద్ది సేపట్లోనే దీనికి సమాధానం దొరకబోతోంది.

అజ్ఞాతవాసి చుట్టూ బోలెడంత రాజకీయ చర్చ సైతం జరుగుతోంది. పవన్ జనసేన అధినేత కావడం రెండు రాష్ట్రాల సీఎం లతో స్నేహం చేస్తుండడంతో ఈ చర్చ మొదలైంది. సాధారణంగా పవన్ చిత్రానికి అభిమానులు ఎగబడతారు. దానికి తోడు పండగ వాతావరణంలో విడుదల అవుతుండడంతో అభిమానుల రద్దీ రెట్టింపయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం పవన్ సినిమా పట్ల ఉదారంగా వ్యవహరించింది. రోజుకు 7 ఆటలు ప్రదర్శించేలా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. ఆ చనువుతోనే బాబు అజ్ఞాతవాసికి ఫేవర్ చేశారని కామెంట్లు వినిపించాయి.

ఇదిలా ఉండగా ఎప్పుడూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ కానీ పవన్ కళ్యాణ్.. నూతన సంవత్సర సందర్భంగా ప్రగతి భవన్ లో కలసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. దీనిపై కూడా సెటైర్లు పడ్డాయి. అజ్ఞాతవాసి విడుదలకు ముందు పవన్ కేసీఆర్ ని కలసి ప్రసన్నం చేసుకున్నారని విమర్శించే వారు విమర్శించారు. కానీ చంద్రబాబు చేసినంతగా కేసీఆర్ ప్రభుత్వం పవన్ కు ఫెవర్ చేయలేదు. ఏపీలో రోజుకు 7 ఆటలు ప్రదర్శించడానికి అడగకుండానే అనుమతి ఇచ్చారు. కానీ తెలంగాణాలో రోజుకు 5 షోలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. అజ్ఞాతవాసికి అసలైన ఫ్రెండ్ ఎవరో..!

Comments