ప్రచురణ తేదీ : Sep 2, 2018 12:40 PM IST

హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ : జనసేనాని జన్మదిన ప్రత్యేకం!

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా టాలీవుడ్ పరిశ్రమకు 1996లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ బాబు ఆ తరువాత మెల్లగా ఒకొక్క మెట్టు ఎక్కుతూ, విజయవంతమైన చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో తన సత్తా చాటుతూ అభిమానుల గుండెల్లో పవర్ స్టార్ గా పేరు సంపాదించారు. కాగా పవన్ కళ్యాణ్ నేడు తన 47వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత నటించిన గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలు కూడా మంచి విజయాలు అందుకోవడంతో పవన్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించారు. ఇక ఆ తరువాత అయన కరుణాకరన్ దర్శకత్వంలో కీర్తి రెడ్డితో జతకట్టి నటించిన తొలిప్రేమ చిత్రం, అప్పట్లో ఒక సెన్సేషన్ లవ్ స్టోరీ గా అద్భుతవ విజయాన్ని సాధించి, ఆయనకు యూత్ హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆ వెంటనే చేసిన తమ్ముడు పర్వాలేదనిపించినా ఆ పై చేసిన బద్రి సూపర్ హిట్ కావడం, ఇక ఆ తరువాత వచ్చిన యూత్ ఫుల్ ఇండస్ట్రీ హిట్ మూవీ ఖుషి చిత్రంతో పవన్ టాలీవుడ్ లో ఒక పెద్ద స్టార్ గా ఎదిగారు.

ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని అయన స్వీయ దర్శకత్వం వహించిన జానీ చిత్రం ప్లాప్ కావడంతో ఆయన అభిమానులు కొంత నిరాశకు లోనయ్యారు. ఇక ఆ తరువాత చేసిన చిత్రాలు కూడా పరాజయాల పాలవడంతో ఆయన తన పంథా కొంత మార్చి అభిమానులకు ఎలాగైనా మంచి హిట్ ఇవ్వాలి అనే తలంపుతో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా మూవీ చేసారు. అది మంచి హిట్ కావడంతో పవన్ మళ్ళి ఫామ్ లోకి వచ్చారు. ఆ అయితే ఆ తరువాత పవన్ కు దాదాపు చాలా ఏళ్లపాటు మంచి విజయం దక్కలేదు. అదిగో అదేసమయంలో ఆయనకు పెద్ద అభిమాని అయిన హరీష్ శంకర్ కు దర్శకుడిగా అవకాశమిచ్చారు పవన్. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కి అప్పట్లో సంచలనం సృష్టించిన దబాంగ్ చిత్రాన్ని గబ్బర్ సింగ్ గా తెరకెక్కించారు హరీష్. ఆ చిత్రంతో పవన్ తన పవర్ మరియు స్టామినాని మరొక్కసారి టాలీవుడ్ కు రుచి చూపించారు. అప్పట్లో ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, ఎన్నేళ్ళనుండో ఎదురు చూస్తున్న పవన్ అభిమానుల దాహార్తిని తీర్చింది. ఆ తరువాత వచ్చిన కెమెరా మాన్ గంగతో రాంబాబు చిత్రం పరాజయం పాలయింది. ఇక తరువాత రెండవసారి త్రివిక్రమ్ తో ఆయన చేసిన అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ హిట్ కావడంతో పవర్ స్టార్ మరింత క్రేజ్ ని చూపించి ముందుకు దూసుకెళ్లారు. ఆ సమయంలో అయన జనసేన పార్టీని స్థాపించి, అంతకముందు అయన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువజన విభాగాధిపతిగా పనిచేసిన పవన్, పార్టీ స్థాపనతో పూర్తి స్థాయి రాజకీయనేతగా రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఇక ఆ తరువాత ఆయన చిత్రాలేవీ కూడా పెద్దగా ఆడలేదు. ఇక ఇటీవల జనవరిలో త్రివిక్రమ్ తో మూడవ సారి చేసిన అజ్ఞాతవాసి ఘోర పరాజయం పాలవడంతో అయన కొంచం ఆలోచనలో పడ్డారు. అయితే మరోవైపు తను స్థాపించిన జనసేన పార్టీపై మరియు ఆ పార్టీ కార్యకలాపాలపై మరింత దృష్టిపెట్టిన పవన్ కొన్నాళ్లపాటు సినిమాలకు విరామం ప్రకటించారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అయన పార్టీ కార్యకలపై ఎక్కువగా దృష్టిపెట్టి, పార్టీని మరింత పటిష్టపరిచేవిధంగా ఇటీవల ప్రజాపోరాట యాత్ర పేరుతో ప్రజల్లోకి కూడా వెళ్లి వచ్చారు. అయితే గత ఎన్నికల్లో టిడిపికి మద్దతించిన జనసేన పార్టీ, రాబోయే ఎన్నికల్లో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నట్లు పవన్ చెప్పారు. కాగా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కు ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నేడు జన్మదినం జరుపుకుంటున్న జనసేనాని హ్యాపీ బర్త్ డే చెపుతూ, భవిష్యత్తులో అయన మరిన్ని శిఖరాలను అధిరోహించి మంచి విజయాలను అందుకోవాలని ఆశిద్దాం…..

హ్యాపీ బర్త్ డే టూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు – నేటిఏపి టీమ్

Comments