హోదా కోసం ఎల్లుండి నుండి నిరసనలు : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు వామపక్ష నేతలతో పలుమార్లు సమావేశమైన ఆయన నేడు విజయవాడ లోని సీపీఐ కారాలయంలో ఆ నేతలతో మరో మారు సమావేశమయ్యారు. అయితే నేడు వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ అధికార టీడీపీ అలానే ప్రతిపక్ష వైసిపి నేతలకు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుని కాలయాపన చేయడమే తప్ప ఎవ్వరికీ కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేదని ఆయన అన్నారు. అందుకే కేంద్రంలో బిజెపి ఏపీకి చేసిన అన్యాయం పై ఇకనైనా పోరాడాలని, ఏపీ కి ప్రత్యేక హోదా కోసం తాను ఎందాకైనా వెళ్ళడానికి సిద్ధమని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగం గా ఈ నెల 6వ తేదీన ఉదయం 10గంటల నుండి వామపక్ష నేతలతో కలిసి పాదయాత్రల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా జాతీయ రహదారులపైనే ఈ పాదయాత్ర జరుగుతుంది. జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో అక్కడి ముఖ్య కూడలిలో పాదయాత్రలు నిర్వహిస్తాం అన్నారు. తాము చేసే ఈ నిరసన కార్యక్రమాలు ఢిల్లీ లోని ప్రధాని, అలానే హోమ్ మంత్రి పేషీ లను తాకేలా చేపడతామని అన్నారు. ఇన్నాళ్లు కేంద్రం వారు ఏదో చేస్తారని ఎదురు చూశామని, ఇక ఆగే ఓపిక లేదని, పోరాడే సమయం ఆసన్నమయిందని, అన్ని పార్టీలు కూడా ఈ హోదా ఉద్యమం లో తమ వంతు సాయం అందించాలని, ఇకపై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, అప్పుడే కేంద్రానికి ఏపీ ప్రజల బాధ అర్ధం అవుతుందని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు…..

Comments