ప్రచురణ తేదీ : Fri, Mar 23rd, 2018

చక్రవ్యుహంలో చిక్కుకున్న ఏపీకి దిక్కేది: నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సినీనటుడు శివాజీ చాలా చాకచక్యంగా ఆలోచించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే కాకుండా దానితో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్న అవకాశాలను వాడుకొనేందుకు ఓ జాతీయ పార్టీ రహస్యంగా ఆపరేషన్‌ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఆపరేషన్‌ ద్రవిడ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై చేసిన ఈ ఆపరేషన్‌లో ఆపరేషన్‌ గరుడ కూడా ఒక భాగమేనన్నారు. కర్ణాటకకు సంబంధించి ఆపరేషన్‌ కుమార, తమిళనాడు, కేరళకు సంబంధించి ఆపరేషన్‌ రావణ పేరుతో ఏర్పాటు చేశారని వివరించారు. ఈ వివరాలను కర్ణాటక నుంచి జాతీయ పార్టీకి అనుబంధంగా చేస్తున్న వ్యక్తి తనకు చెప్పారని శివాజీ గుట్టు బయట పెట్టేసారు. ఆపరేషన్‌ వివరాలన్నీ పెన్‌డ్రైవ్‌లో తనవద్ద ఉన్నాయని దాన్ని బయటికి తీసే సమయం వచ్చిందని స్పష్టంచేశారు. తాను ఆ పార్టీ పేరు దానికి సహాయం చేస్తున్న వారి పేర్ల‌ను ప్ర‌త్య‌క్షంగా చెప్ప‌డం లేదని విషయం తెలుసుకున్న వల్లే అర్థం చేసుకోవాల‌ని వ్యాఖ్యానించారు.

తాను గ‌త ఏడాది ఢిల్లీలో కొన్ని నిజాల‌ను తెలుసుకున్నాన‌ని అన్నారు. ఓ జాతీయ పార్టీకి ఓ అనుబంధ సంస్థ నేతలు స్వీప‌ర్ సెల్స్ లా ప‌నిచేస్తున్నారని అన్నారు. కర్ణాటకకు చెందిన ‘కల్యాణ్ జీ’ అనే ముఖ్యమైన వ్య‌క్తి ఒకరు ఉన్నారని, ఆయన అసలు పేరు నేను కచ్చితంగా తేల్చి చెప్పలేనని, తనకు తెలిసినంత వరకు ఆయన పేరు కల్యాణ్ జీ అని అన్నారు. ‌దక్షిణాదిన ఆ జాతీయ పార్టీకి కల్యాణ్ జీ అనే ఆ వ్యక్తే స‌హ‌క‌రిస్తున్నార‌ని తెలిపారు.ఒక జాతీయ పార్టీ, దానికి లక్ష్యంగా ఉన్న ప్రాంతీయ పార్టీ, వారికి ఉపయోగపడే పార్టీ, పావుగా మరో వ్యక్తి ఇలా.. ఆ ఆపరేషన్‌ క్రమం ఉంటుందని కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. తాను ఇలా చెబుతుంటే ఎవరూ నమ్మరని తనకు తెలుసన్నారు. కానీ, ఈ విషయంపై తాను గతేడాది సెప్టెంబర్‌లోనే లీక్‌ చేశానన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌ కోసం రూ.4,800 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అందులో కొంత మొత్తం ఇప్పటికే బట్వడా జరిగినట్టు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సూత్రధారి ఒక ప్రజా రాజ్యాంగ శక్తి అన్నారు. దీనిలోకి వచ్చే వాళ్లకు రావడం మాత్రమేగానీ, బయటకు వెళ్లడం తెలీదన్నారు ఒక్కసారి గనక ఇరుక్కుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళేది లేదన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పిచ్చివాళ్లు కాదని, సమయం వచ్చినప్పుడు దిమ్మ తిరిగేలా తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో ఉన్న అనైక్యతను వాళ్లు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం రేపు అవిశ్వాసంపై చర్చకు సిద్ధపడతారని, అందులో ముగ్గుర్ని ఇంగ్లీషులో, మరో ముగ్గురిని తెలుగులో మాట్లాడిస్తారని వివరించారు. ఆ తర్వాత ఎవరినీ మాట్లాడనీయకుండా సభను ఎప్పటిలాగానే వాయిదా వేస్తారన్నారు.

ఇంతకు మునుపే 2015లో ప్రత్యేక హోదాపై తాను హైకోర్టును సంప్రదించానని శివాజీ తెలిపారు. ఏ రాజకీయ పార్టీతోనూ తనకు అవసరంలేదని, తనకు అందరూ కావాలన్నారు. ఏపీ బాగోగుల కోసమే తాను పాటుపడుతున్నట్టు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో విచిత్రమైన విషయాలు ఉంటాయన్నారు. ఈ ఆపరేషన్‌లో తనకు తెలిసిన మేర వివరాలను ఒకదానిపై రాసి పెట్టుకున్నట్టు వివరించారు. దానికి సంబంధించిన పెన్‌డ్రైవ్‌ అందరికీ ఇస్తానన్నారు. దాన్ని ఎవరైనా వాడుకోవచ్చని తెలిపారు. ఈ విషయం తనకు 2017 సెప్టెంబర్‌లోనే తెలిసిందన్నారు. ఈ వివరాలు వెల్లడించడంలో ప్రత్యేక హోదా సాధన సమితికి గానీ, ఏ రాజకీయ పార్టీకి గానీ సంబంధంలేదని స్పష్టంచేశారు. తనకు తెలిసిన వివరాలను మాత్రమే వ్యక్తిగతంగా తాను పెట్టినట్టు చెప్పారు. అయితే, ఈ వివరాలను ఎందుకు నమ్మాలనేది ఎవరి ఇష్టం వారిదన్నారు. నిజంగా శివాజీ చెప్పిన మాటలు నిజమైతే ఆంధ్రా పరిస్థితి అంటే అని కొందరు విశ్వాసకులు వెల్లడించారు. ఏదేమైనా శివాజీ చెప్పిన దాని గురించి కూడా ఒక్కసారి ఆలోచించాల్సి ఉందని టీడీపీ నేతలు మాట్లాడుకున్నట్టు సమాచారం.

ఈ ఆపరేషన్ ఎలా పనిచేస్తుందన్నది ఆయన మాటల్లోనే చూద్దాం…

“ఓ జాతీయ పార్టీ ఉంది. అది ఏపీకి సంబంధించి మూడు టార్గెట్‌లు పెట్టుకుంది. 1.అధికార పార్టీ 2.ఓ కొత్త రాజకీయ నాయకుడు 3.ఇంకో ముఖ్యపార్టీ.

1. అధికార పార్టీ: సీబీఐ కేసులని రీ ఓపెన్ చేయడం, ఆర్థికంగా క్రుంగిపోయేలా చేయడం, చక్ర వ్యూహంలో ఇరికించడం, ఆ పార్టీని చివరకు ఏకాకిని చేయడం తద్వారా నిర్వీర్యం చేయడం ఈ వ్యూహ లక్ష్యాలు.

2. కొత్త నాయకుడు: తాను పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఆ పార్టీ నాయకుడికి ఏ మాత్రం అనుమానం రాకుండా చేయడం. స్థానిక ప్రభుత్వాన్ని చిందరవందర చేయడం ఈయన లక్ష్యం. ఇందులో భాగంగా ఈయన ప్రజలకు కొన్ని రెచ్చగొట్టే విధంగా మాయ మాటలు చెబుతారు. రాష్ట్రం పట్ల తనకు చాలా బాధ్యత ఉన్నట్లు, సమాజం పట్ల ప్రేమ ఒలకబోస్తాడు. రాజకీయాల్లోంచి వైదొలగిన కొందరు నాయకులని ఈ కొత్త నాయకుడు కలుస్తూ తనపార్టీలోకి లాక్కునే ప్తయట్నం చేయడం. వాళ్లు ఈ కొత్త నాయకుడికి సహకరిస్తుంటారు. ప్రభుత్వాన్ని ఎలా సంషయోపెతం చేయాలనే విషయాన్ని వారు ఈ కొత్త నాయకుడికి చెబుతుంటారు. మ‌న తెలుగువారికి స‌హ‌జంగా ఉండే స్వార్థాన్ని ఆ జాతీయ పార్టీ వినియోగించుకుంటుంది.

3.ఇంకో ముఖ్యపార్టీ: నేరం నిరూపితం కాలేదు కాబట్టి ఈ పార్టీ అధికార నాయకుడు ఇంకా నిందితుడు మాత్రమే. అసలు బలి పశువులు వీరే, వీళ్ళు కేవలం ఆటలో అరటిపండు లాంటివాళ్ళు మాత్రమే. ఈ విషయం వీరికి కూడా తెలియదు. జాతీయ పార్టీలో తేలికగా చేరొచ్చని వీళ్లు అనుకుంటున్నారు. జాతీయ పార్టీయే కావాల‌నే ఈ ముఖ్య పార్టీ కోసం దారులు తెరిచింది. ఈ ముఖ్య పార్టీ నాయ‌కుడి మీద గుంటూరు, హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే రెక్కీ నిర్వ‌హించారు. ప‌క‌డ్బంధీగా ప్రాణ‌హానీ లేని దాడి చేస్తారు. దీంతో ఈ రాష్ట్రంలో అల‌జ‌డులు మొద‌ల‌వుతాయి. అదే సమయంలో కొన్ని విష‌యాల్లో (కేసుల్లో) ఈ ముఖ్య నాయ‌కుడికి ఊర‌ట‌లు ల‌భిస్తాయి. పూర్తి ఊర‌ట మాత్రం రాదు. పెండింగ్ లో ఉంటుంది. అదే సమయంలో బీహార్, ఒడిశా నుంచి వ‌చ్చి కొంద‌రు రాష్ట్రంలో అల్ల‌ర్లు మొద‌లు పెడ‌తారు.

సెప్టెంబ‌రు 1న రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేస్తారు. అదే ఆఖరి తేదీ.. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి ఆ నాయకుడు మొదటి సారిగా ఇదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఎన్నికల్లో కొత్త నాయకుడికి, ఏపీలోని ముఖ్య పార్టీకి సీట్లు అవే వచ్చి పడతాయి. ఎన్నికల తరువాత ముఖ్య పార్టీకి చెందిన వ్యక్తిని కూడా కేసుల్లో చివరకు జైలుకి వెళ్లేలా చేస్తారు. ఇక ఈ కొత్త నాయకుడిని కేంద్ర మంత్రిగా ఉండాలని చెబుతారు. కేంద్ర మంత్రిగా ఉండడం ఇష్టం లేక ఆ కొత్త నాయకుడు అలిగి వెళ్లిపోతాడు.

చివరకు ఇప్పటి అధికార పార్టీలోని నేతలు మరో పార్టీలోకి వెళతారు. జాతీయ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి ఎవరవుతారంటే.. ఆ పార్టీకి చెందిన ఓ తెలుగు వ్యక్తి అవుతారు.. ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేస్తారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఓ వ్యక్తి కోవర్టుగా కూడా పనిచేస్తున్నారు. అధికారం, డబ్బు ఆశ అన్ని కల్పిస్తారు. చివరకు నష్టపోయేది మన రాష్ట్రమే. నాకు ఏ పార్టీపై కోపం లేదు. ఆ జాతీయ పార్టీ వేసిన ప్లాన్‌లో చిక్కుకుపోవద్దు. నాకు తెలిసిన విషయాలను చెప్పాను. మీ రాజకీయ భవిష్యత్తు కోసం, స్వార్థం కోసం తెలుగు తల్లిని అవమానంలోకి నెట్టకండి”. అని కళ్ళకు కట్టినట్టు వివరించాడు.

Comments