ప్రచురణ తేదీ : Jun 12, 2018 4:12 PM IST

ఆ ఛార్జి షీట్లలో జగన్ దోచుకున్న మెనూ మొత్తం వుంది : చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అమరావతిలో టిడిపి సమన్వయ కమిటీ భేటీలో పాల్గొని నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం తన ముందున్న ద్యేయమని, దానికోసం అధికారులు నిరంతరం కష్టపడుతున్నారని అన్నారు. నిత్యం ఆ ప్రాజక్టు వద్దకు దాదాపు 13 బస్సుల్లో ప్రజలు సందర్శన కోసం వెళ్తున్నారని, ఇప్పటివరకు మొత్తం 22వేలమంది ప్రజలు పోలవరాన్ని సందర్శించారని అన్నారు. మనకు ఎంతో ముఖ్యమైన ప్రాజక్టు అయిన పోలవరాన్ని కట్టడానికి ఒకింత ఎక్కువే శ్రమ పడక తప్పదని అన్నారు. పార్టీ కోసం, ఇటువంటి వాటికోసం కష్టపడటం తమ సొంత ఇంటికోసం కష్టపడ్డట్లే అని ఆయన స్పష్టం చేశారు. అలానే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నేతలు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలను వినియోగించుకుని ముందుకు సాగాలన్నారు. ఎంత విజయం సాధించామన్నదే ముఖ్యంతప్ప ఎంత కష్టపడ్డాం అనేది ముఖ్యం కాదని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని సహజవనరులను అందినంత దోచుకుంటున్న జగన్ పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. అసలు ఈ రాష్ట్రంలో ఆయన, తన తండ్రి సాయంతో దోచుకోకుండా మనకు మిగిల్చింది ఏమైనా ఉందా అని అన్నారు. అంతే కాక కొందరు రౌడీలు, గుండాల అండతో మిగిలివున్న వనరులను దోచుకునే కార్యక్రమం మొదలుపెట్టి, నిజాలు ప్రశ్నించిన తమపై ప్రత్యారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కింద బాక్సయిట్, సహజవనరులు, లైం స్టోన్ తదితరాలు తిని రాష్ట్రాన్ని ఖాళీచేశారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే జగన్ తిన్న మెనూ అంతా కూడా అయన పై ఫైల్ చేసిన ఛార్జి షీట్లలో పొందుపరచపడి ఉందని, సత్యం మరియు న్యాయమే అదంతా బయటకు తీస్తుందని ఆయన స్పష్టం చేసారు. కోట్లు దోచుకున్న జగన్ చేతికి ఈ రాష్ట్రాన్ని అప్పగిస్తే చివరకు ఏపీ ప్రజలకు ఏమి మిగలనివ్వరని, అందినంత వారి పార్టీనేతలకే కట్టబెడతారని అన్నారు…..

Comments