ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

ఆంధ్రప్రదేశ్ లో భూకంపం..పరుగులు తీసిన ప్రజలు

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న కొన్ని ప్రాంతాలు తెల్లవారుజామున ఉలిక్కిపడ్డాయి. స్వల్ప భూ ప్రకంపనలు రావడంతో అందరు షాక్ కి గురయ్యారు. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్లలో నుంచి బయటకి పరుగులు తీశారు. అయితే ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై ఒక పాయింట్ మాత్రమే నమోదైందని కంగారు పడాల్సింది ఏమి లేదని అధికారులు వెల్లడించారు. అయితే 2015లో కూడా ఇదే స్థాయిలో అక్కడి పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే వీటి వల్ల ఆస్తి, ప్రాణ నష్టం ఉండదని కూడా అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని దుర్గాపురం, ముస్తాబాద్, తుళ్లూరు అలాగే కేసరపల్లి, బుద్ధవరం సమీప గ్రామాల్లో భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. అంతే కాకుండా నిన్న రాత్రి 10 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో వారు నిద్రలేకుండా గడిపినట్లు చెబుతూ.. తెల్లవారు జామున కూడా భూమి కంపించిందని వివరించారు.

Comments