కాంగ్రెస్ లో మరింత కలవరం..!

congress12
మొన్నటి వరకు వివిధ రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభం ఇప్పుడు ఏకంగా జాతీయ నాయకత్వానికి తాకుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ వేర్వేరు పిసిసి అధ్యక్షులను నియమించింది. ఏపిలో పిసిసి నాయకత్వం నియామకంపై వ్యతిరేకత రాకపోయినా.. తెలంగాణ పీసీసీ నాయకత్వం ఎంపికపై తిరుబాటు బహిరంగంగా సాగింది. ఆ వ్యతిరేకత నేటికీ కొనసాగడం కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ తిరుబాటు నేపథ్యంలో టి పిసిసి నాయకత్వ మార్పుపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ పలుమార్లు స్పందిస్తూ ఇప్పటికిప్పుడు అది సాధ్యంకాదన్న సంకేతాలు పలుమార్లు ఇచ్చింది. కానీ టీ-పీసీసీ నాయకత్వం మార్పు చేయాలన్న డిమాండ్‌ నిరాటకంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతునే ఉంది. తాజాగా ఈ నాయకత్వ మార్పు వివాదం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ నాయకత్వానికి తాకింది.

ఏఐసిసి పగ్గాలను త్వరలోనే గాంధీయేతర కుటుంబం చేపట్టవచ్చని ఇటీవల కొద్దిరోజుల కిందట ఆ పార్టీ సీనియర్‌ నేతలే వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మరికొన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రియాంకా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నారు. మరి కొందరు సీనియర్‌ నేతలు మాత్రం గాంధీయేతర కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పగించాలని అంతర్గతంగా డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉంటే మరోవైపు రాష్ట్రాలలో పార్టీ నాయకత్వాలపై తిరుగుబాటు సమస్య మరో తల నొప్పిగా ఆ పార్టీ నాయకత్వానికి మారింది. టి కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు పార్టీ హైకమాండ్‌ను మరింత కలవరంలో పడేస్తున్నాయని తెలుస్తోంది. తాను ఎదుర్కొంటున్న ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో టి కాంగ్రెస్‌లో ఉన్న పార్టీ ధిక్కారస్వరాలపై కొరఢా ఝుళిపించలేక పార్టీ అగ్రనాయకత్వం సతమతమవుతోంది.

ఇటీవల కాలంలో జరిగిన ఓ సమావేశంలో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలు ధిక్కార స్వరాన్ని పెంచినట్లు సమాచారం. మీ నాయకత్వంలో, మీ విధానాల వల్ల పార్టీ బలోపేతం కావడంలేదని, మీరు పార్టీని నడిపిస్తున్న తీరు సరిగా లేదని రాహుల్‌ ఎదుటే కొందరు నేతలు బాహాటంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసినట్లు సమాచారం. ఇలా తనపై నేరుగా తిరుగుబాటు చేస్తున్న నేతలను నియంత్రింలేని పరిస్థితిలో తమ పార్టీ హైకమాండ్‌ ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలు తమకు ఎంతో నష్టం చేకూర్చుతాయన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. రాష్ట్రాలలో గ్రూపు తగాదాలున్నా ఎన్నికల సమయం నాటికి, పార్టీ గాడిలో పెట్టాల్సిన సమయానికి తెరపైకి పార్టీ హైకమాండ్‌ వస్తుంది అన్న ధీమా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉంటుంది. ఇదే తమ పార్టీ బలమని ఆ పార్టీ నేతలు సైతం పేర్కొంటుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా నెలకొందని ఆ పార్టీ వర్గాలు సైతం అంతర్గంతంగా ధృవీకరిస్తున్నాయి. తనపై వచ్చిన ధిక్కార స్వరాలనే నియంత్రించే స్థితిలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ లేదని వారు చెబుతున్నారు.

పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడుపార్టీ హైకమాండ్‌కు దగ్గరగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు అధిరోహించిన వ్యక్తులే నేడు పార్టీ అగ్రనాయకత్వానికి తలనొప్పిగా మారారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గత కొద్దికాలం కిందట చిదంబరం, దిగ్విజయ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం రేపాయని సమాచారం. ఒకప్పుడు పార్టీ హైకమాండ్‌కు దగ్గరగా ఉన్న శశిధరూర్‌ సైతం కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నరేంద్రమోడీని పొగడ్తలతో ముంచెత్తారు. మరి కొందరు రాహుల్‌, సోనియాగాంధీ పార్టీ నుంచి తప్పుకొని ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి కాంగ్రెస్‌ హైకమాండే నేరుగా విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిలో టి కాంగ్రెస్‌లోని ధిక్కార స్వరాలకు మరింత బలం చేకూరిందని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యనిస్తున్నారు. ధిక్కార స్వరాలు నియంత్రించలేని నిస్సహాయ స్థితిలోకి పార్టీ హైకమాండ్‌ నెట్టేయబడిందని చెబుతున్నారు. పార్టీపై తిరుగుబాటు చేసే నేతలను నియంత్రించాలంటే ముందుగా పార్టీ హైకమాండ్‌ బలపడ్డాల్సిన అవసరముందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అప్పుడే పార్టీలోని ధిక్కార స్వరాలను పార్టీ హైకమాండ్‌ పైచెయ్యి సాధిస్తుందని వారు చెబుతున్నారు.

Comments