బాబు.. జగన్.. పవన్..మీ రూటు మారదా..!!

2018 లోకి అడుగు పెట్టేశాం. రాజకీయ భాషలో చెప్పాలంటే 2018 అనేది ఎలక్షన్ ప్రిపరేషన్ కోసం రాజకీయ నాయకులూ వాడుకునే ఏడాది. ముందస్తు ఎన్నికలు వస్తాయో వారో కానీ 2019 ఆరంభంలో పార్లమెంట్ ఎన్నికలు, తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. తెలంగాణాలో అయితే ఇప్పటికి అధికార పార్టీకి పెద్ద ఇబ్బంది అయితే లేదు. ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అటు అధికార పార్టీ, ప్రతిపక్షం రెండూ బలంగా కనిపిస్తున్నాయి. ఇక జనసేన కూడా వడివడిగా అడుగులు వేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. పవన్ కళ్యాణ్ ఈ ఏడాది పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీల అధినేతలు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతున్నారు. కొత్త సంవత్సరం అయితే వచ్చిందికాని చంద్రబాబు, జగన్ మరియు పవన్ ల వ్యూహాలు మాత్రం పాతవే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ప్రస్తుతం ఈ ముగ్గురు ఎటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

అదే బాబు మంత్రం : ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడే పార్టీ నేతలకు సంకేతాలు పంపుతున్నారు. ఎన్నికలు ఇప్పటినుంచే సన్నధం కావాలని ఇటీవల టీడీపీ నేతలని ఆదేశించారు. కొంత మంది ఎమ్మెల్యే లు ఈత హెచ్చరించినా మారడం లేదని, అటువంటి వారికీ టికెట్ దక్కదని హెచ్చరిస్తున్నారు. బాబు హిట్ లిస్టులో నలభై మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన వచ్చే ఎన్నికల్లో భారీగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్లు కోల్పోవలసి రావచ్చు. ఇక ప్రజల్లోకి చేరుకునే విషయంలో ఆయన పాత పంథానే పాలో అవుతున్నారు. అభివృద్దే తన మంత్రం అని ప్రతి సమావేశంలో ఊదరగొడుతున్నారు. అమరావతి ని చూపెడుతూ ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చి దిద్దుతానని బాబు చెబుతున్నారు. కానీ ఇంతవరకు అమరావతి రాజధాని విషయంలో అనుమతులు భూసేకరణ మినహా శాశ్వత మైన అడుగు ఒక్కటి కూడా పడలేదు. కానీ రాజధాని నిర్మాణానికి సరైనోడు బాబే అని ఇప్పటికే ప్రజల్లో పాజిటివ్ ఒపీనియనే ఉంది. కానీ ఎన్నికల హామీల విషయంలో మాత్రం బాబు ప్రతిపక్ష విమర్శలకు ఛాన్స్ ఇచ్చారు.

పాదయాత్రమీదే ఆశలు : ప్రతిపక్ష నేత జగన్ తన పంథా మార్చుకోవాలని విమర్శలు ఎదురవుతున్నాయి. జగన్ ఏకపక్ష నిర్ణయాలు, దూకుడు స్వభావం పార్టీకి మైనస్ గా మారుతోందని ఆ పార్టీ ఇన్ సైడ్ నుంచే కంప్లైన్ట్ వస్తోంది. 2019 ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు పలు వ్యూహాలని అమలు చేస్తున్నా అవన్నీ పాతధోరణిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. తన సెంటిమెంట్ ఫార్ములానే జగన్ నమ్ముకుని ముందుకు వెళుతున్నారు. పాదయాత్రలో హామీల వర్షం కురిపిస్తూనే సెంటిమెట్ రాగం వినిపిస్తున్నారు. జగన్ పాదయాత్ర ముగిసే సమయానికి ఏపీలో ఎన్నికల హీట్ బాగా పెరుగుతుంది. దీనితో జగన్ కు పాదయాత్ర బాగా కలసి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా వైసిపి నుంచి భారీగా ఎమ్మెల్యేల వలసలు పెరుగుతుండడంతో ఆ పార్టీపై నెగిటివ్ పబ్లిసిటీ కూడా పెరుగుతోంది. జగన్ వైఖరి తోనే తాము పార్టీ మారుతున్నామని టిడిపిలోకి జంప్ అయిన వారంతా చెబుతున్నారు.

జనసైనికుల పడిగాపులు : ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. విమర్శలని కాసేపు పక్కన పెడితే జనసైనికులే సేనాని రాకకోసం పడిగాపులు కాస్తున్నారు. పార్టీ పెట్టి నాలుగేళ్లు అవుతున్నా పవన్ ఇంతవరకు ఏపీలోని అన్ని జిల్లాలో పర్యటించలేదు. తాను కమిటై ఉన్న సినిమాల వలన ఆలస్యం అవుతోందనేది ఇంకోవైపు నుంచి వినిపిస్తున్న వాదన. ఆరు నెలలకి ఓసారి వచ్చి వెళ్లే ధోరణిని కి పవన్ స్వస్తి చెప్పాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో కాస్త పార్టీ నిర్మాణం వేగవంతం అయినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది జన సైనికుల్ని ఆ పార్టీ రిక్రూట్ చేసుకుంది. ఉన్న తక్కువ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడమే పవన్ ముందు ఉన్న బిగ్ టాస్క్. కానీ తన వద్దకు వచ్చిన సమస్యల విషయంలో పవన్ శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాడు అనే మంచి అభిప్రాయం నెలకొంది. జనసేన కేంద్రంగా మరో పెద్ద ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ సామజిక వర్గానికి ఆ పార్టీ ఆశా దీపంగా మారిందని.. వారంతా పవన్ వైపు చూస్తున్నారని పొలిటికల్ ఇన్నర్ సర్కిల్స్ చర్చించుకుంటున్న మాట. పవన్ మాత్రం తనకు కులాన్ని ఆపాదించవద్దని ఖరాఖండిగా చెబుతున్నారు.

Comments