ఇండియన్ టీం కు కామన్వెల్త్ వార్నింగ్..

కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న ఇండియన్ టీమ్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్. గేమ్స్ విలేజ్‌లో ఇండియన్ బాక్సింగ్ టీమ్ ఉంటున్న ప్లేస్‌లో సిరంజీలు కనిపించడం వివాదానికి కారణమైంది. గేమ్స్ విలేజ్‌లోకి సాధారణంగా నీడిల్స్‌ను అనుమతించరు. దీంతో ఇది ఉల్లంఘన కిందే ఫెడరేషన్ పరగణించింది. ఈ మేరకు ఇండియన్ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారి విక్రమ్ సింగ్ సిసోడియాకు ఫెడరేషన్ ఓ వార్నింగ్ లెటర్‌ను పంపించింది. అటు బాక్సింగ్ టీమ్ డాక్టర్‌గా ఉన్న అమోల్ పాటిల్‌ను హెచ్చరిస్తూ మరో లేఖ రాశారు.

వెంటనే కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ విధివిధానాలు తెలుసుకోవాలని, మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడాలని ఆ లేఖలో హెచ్చరించింది. గత శనివారం గేమ్స్ విలేజ్‌లో సిరంజీలు కనిపించాయని ఫెడరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గ్రీవెమ్‌బర్గ్ తెలిపారు. దీనిని తాము యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేదని, అయితే నీడిల్ ఉపయోగించకూడదన్న గేమ్స్ నిబంధనలను మాత్రం ఇండియన్ టీమ్ ఉల్లంఘించిందని గ్రీవెమ్‌బర్గ్ చెప్పారు. ఒకవేళ డయాబెటిస్‌లాంటి వాటికోసం నీడిల్స్ ఉపయోగించాలనుకుంటే.. ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Comments