ప్రచురణ తేదీ : Dec 28, 2016 1:09 PM IST

సినీ ఫక్కిలో 46 కేజీలు బంగారం దొంగతనం చేసిన దుండగులు

muthut
బ్యాంకుల్లోకి అధికారుల్లా వెళ్లి తరువాత బ్యాంకు సిబ్బందిని బెదిరించి డబ్బు ఎత్తుకుపోవడం మనం చాలా సినిమాలలో చూసాం. అచ్చం ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగింది. బుధవారం ఉదయం రామచంద్రాపురంలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి అయిదుగురు వ్యక్తులు ప్రవేశించి తమను తాము సిబిఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. కార్యాలయం రికార్డులను పరిశీలించాలని, లాకర్లలో ఉన్న బంగారాన్ని తనిఖీ చేయాలనీ సిబ్బందిని అడిగారు. సిబ్బంది మాత్రం ఉన్నతాధికారుల అనుమతి లేనిదే తాము లాకర్లను చూపించలేమని చెప్పారు. దీంతో దుండగులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిబిఐ అధికారులు అడిగినా లాకర్లను చూపించారా అని గదమాయించడంతో భయపడిన సిబ్బంది లాకర్లను చూపించారు. లోపలకు వెళ్లిన దుండగులు బంగారాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటుంటే సిబ్బంది వారిని ప్రశ్నించారు. దుండగులు వారిని ఆయుధాలతో భయపెట్టి అందరినీ బాత్రూం లోకి నెట్టి గడియ పెట్టారు. మొత్తం లాకర్లలో ఉన్న 46 కేజీల బంగారాన్ని తమతో తీసుకుపోయారు. వెళ్తూ.. వెళ్తూ తమతో పాటు సీసీ కెమెరా ఫుటేజీని కూడా తీసుకుపోయారు. దోపిడీకి గురైన బంగారం విలువ 12 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments