రోజాపై పోటీకి దిగేదెవరు, గెలిచేదెవరు ?

గత ఎన్నికల్లో కేవలం 800 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఈసారి తప్పక ఓడించాలనే దృఢ నిశ్చయంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఈసారి కూడ నగరి టికెట్టుని గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబానికే కేటాయించారు. ఈ యేడాది ఫిబ్రవరి నెలలో ముద్దు కృష్ణమనాయుడు మరణించడంతో ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలనేది బాబు నిర్ణయం.

కానీ అనూహ్యంగా టికెట్ నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు అన్నదమ్ములు భాను ప్రకాష్, జగదీశ్ లు వాదనకు దిగడంతో బాబుకు కొత్త తలనొప్పి మొదలైంది. ఈమేరకు ఎవరి టికెట్ కావాలో త్వరగా నిర్ణయించుకుని చెప్పమని, అదే విధంగా ఎవరికి టికెట్ ఇచ్చినా రెండో వారు వారికి సహకరిస్తామని హామీ కూడ ఇవ్వాలని, ఈసారి రోజాపై గెలిచి తీరాల్సిందేనని, మీ వ్యక్తిగత కారణాలకు పార్టీని నష్టపరచవద్దని, ఒకవేళ సయోధ్య కుదరకుంటే బయటి వ్యక్తులు ఎరికైనా టికెట్ ఇవ్వాల్సి వస్తుందని గట్టిగా చెప్పారట.

దీంతో కొంచెం పట్టు వదిలి చర్చలు జరుపుకున్న అన్నదమ్ములిద్దరూ ఎవరికి టికెట్ ఇవ్వాలో మీరే తేల్చండని, ఎవరికిచ్చినా ఇద్దరం కలిసి పనిచేస్తామని బాబుకు చెప్పినట్టు సమాచారం. మరి బాబు రోజాపై పోటీకి ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి.

Comments