అందులో చంద్రబాబే టాప్!

టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక అద్భుత రికార్డు సాధించారు. దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. ఆయన మొత్తం (స్థిర, చర) ఆస్తుల విలువ సుమారు రూ.177 కోట్లని, దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులేనని ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) ఓ నివేదిక విడుదల చేసింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం చంద్రబాబు తర్వాత రెండో ధనిక సీఎంగా రూ.129 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ నిలిచారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ రూ.48 కోట్ల ఆస్తులతో మూడో స్థానాన్ని ఆక్రమించారు. కాగా
రూ.15 కోట్ల విలువైన ఆస్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాలుగో స్థానంలో నిలిచారు. దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉందని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌(ఎన్‌ఎల్‌డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. దేశంలోని అత్యంత పేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.30 లక్షలుపైగా ఆస్తులతో రెండవ స్థానంలో, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రూ.56 లక్షలు ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు.

మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది (35శాతం) పై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అందులో దాదాపు 26 శాతం మంది పై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదికలో తెలిపింది. అయితే చంద్రబాబుపై 3, కేసీఆర్‌పై 2 కేసులు నమోదై ఉండగా వీటిలో ఒకటి క్రిమినల్ కేసు అని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై అత్యధికంగా 22 కేసులు నమోదయ్యాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌పై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై 10 కేసులు నమోదయ్యాయి. ఇక విద్యార్హతల విషయానికి వస్తే, మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది పన్నెండవ తరగతి ఉత్తీర్ణులు కాగా, 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తివిద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్‌ సాధించినట్లు ఆ సంస్థ పేర్కొంది….

Comments