బ్రేకింగ్ న్యూస్ : స్నేహితుడి బర్త్ డే, వాళ్ళ పాలిట డెత్ డే గా మారింది

స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా ఆనందంగా గడపడానికి విహారయాత్రకు బయలుదేరిన స్నేహితుల బృందం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇంటి నుంచి బయలుదేరిన గంటలోపే చోటు చేసుకున్న ఈ ఘటన ఆయా కుటుంబాలలో విషాదాన్ని నింపింది. కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయం ఎదుట శ్రీశైలం, హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి బర్త్ డే, వాళ్ళ పాలిట డెత్ డే గా మారింది. కాగా ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, కడ్తాల ఎస్‌ఐ సుందరయ్య, క్షతగాత్రుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి

హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌కు చెందిన ఎమ్‌.డి.ఖాసీఫ్‌ పుట్టిన రోజు నేపథ్యంలో నేడు తోటి మిత్రులైన ఎమ్‌.ఫిరోజ్‌ ,సయ్యద్‌ సమీర్‌, ఎం.డి.మోహిన్‌, ఎం.వాహాజ్‌, సయ్యద్‌ అబ్దుల్‌ ఖరీమ్‌, అస్గర్‌ అలీ, రియాజ్‌ ఎక్భాల్‌, ఎం.డి.అప్షర్‌ లు శ్రీశైలండ్యామ్‌ చూడడానికి ఇన్నోవాలో బయలు దేరారు. కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయం వద్ద ఆగివున్న టిప్పర్‌ను వేగంగా వెళ్తోన్న వారి ఇన్నోవా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎం.డి.ఫీరోజ్‌, సయ్యద్‌ సమీర్‌ లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎం.డి.ఖాసీఫ్‌, ఎం.డి.మోహిన్‌, ఎం.డి.వాహజ్‌, సయ్యద్‌ అబ్దుల్‌ ఖరీమ్‌, అస్గర్‌ అలీ, రియాజ్‌ ఇక్భాల్‌, ఎం.డి. అప్సర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో మృతదేహాలు, కారు నుజ్జునుజ్జు అయ్యాయి. అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలు, గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు.

ప్రమాద సంఘటనతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సుందరయ్య, ఆమనగల్లు ఎస్‌ఐ మల్లేశ్వర్‌లు పోలీసులు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, గాయపడ్డ వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఎం.డి.మోహిన్‌, అస్గర్‌అలీ, ఖాసీ్‌ఫల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ మొత్తం ఏడుగురిలో నలుగురిని మైసిగండి నుంచే హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించగా, మరో ముగ్గురిని కల్వకుర్తి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. మృతి చెందిన, గాయపడ్డ వారంతా 25 ఏళ్లలోపు యువకులే. పోస్టుమార్టం అనంతరం ఫీరోజ్‌, సమీర్‌ల మృతదేహాలను పోలీసులు వారి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుందరయ్య తెలిపారు.గాయపడ్డ, మృతిచెందిన వారి కుటుంబీకుల, బంధువుల రోదనలతో ఓల్డ్ మలక్ పేటలో విషాద ఛాయలు అలముకున్నాయి….

Comments