ఫుడ్ లో బొద్దింక, పరిహారంగా రూ.87 లక్షలు డిమాండ్
కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణీకుల పట్ల ఎంత నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తాయి అనేది ఇటీవల జెట్ ఎయిర్వేస్, అలానే స్పైస్ జెట్ సంస్థల బాగోతాలు కొన్ని వెలుగులోకి వస్తే చూసి అందరం ఆశ్చర్యపోయాం. అయితే ప్రస్తుతం మరొక ఘటన వెలుగులోకి రావడంతో విమానయాన సంస్థలు ప్రయాణీకుల పట్ల ఎంత అశ్రద్ధ, నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయో తెలుస్తోంది. ముంబయికి చెందిన యూసఫ్ ఇక్బాల్ అనే న్యాయవాది ఫిబ్రవరి 27న మొరాకో నుంచి ముంబయికి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తున్నాడు.
తనకు విమాన సిబ్బంది అందించిన చికెన్ సలాడ్‌లో బొద్దింక ఉండటాన్నిచూసి అతను ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు.ఈ ఘటన కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఆ తర్వాత చేయాల్సిన విమాన ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకున్నాడు. ఈ ఘటన కారణంగా వృత్తిపరంగా రూ.30 లక్షలు నష్టపోయానని, అలాగే తాను అనుభవించిన మానసిక వేదనకు రూ.50 లక్షలు, టికెట్ ఖర్చులు రూ.7 లక్షలతో కలిపి మొత్తం రూ.87 లక్షలు చెల్లించాలని ఆ విమానయాన సంస్థకు పంపిన లీగల్ నోటీసులో పేర్కొన్నాడు. దీనిపై ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ప్రతినిధులు స్పందిస్తూ, మొరాకోలో ఈ సీజన్లో ఇలాంటి కీటకాలు సాధారణంగా కనిపిస్తాయి.
అయితే అది విమానంలోకి ఎలా చేరిందో అర్థంకావడం లేదు అని చెప్పడం గమనార్హం. అయితే ఈ వివరణకు సంతృప్తి చెందని ఇక్బాల్ మాత్రం నష్టపరిహారాన్ని ఏప్రిల్ నెలలోపే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక్బాల్ గత 17 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. లండన్‌కు చెందిన అంతర్జాతీయ కౌన్సిల్లో సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే ఆవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమిరేట్స్ సంస్థ చేసిన తప్పుకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని యూసఫ్ కు పలువురు మద్దతు పలుకుతున్నారు…..