చంద్రబాబుని బిజెపి జైలుకు పంపుతుందా..?

పోలవరం ప్రాజెక్ట్ ని చేపట్టడానికి కేంద్రం సిద్ధం అయితే నమస్కారం పెట్టి ఇచ్చేస్తా.. చంద్రబాబు చేసిన ఈ ఒక్క కామెంట్ చాలు పోలవరం ప్రాజెక్ట్ సీరియస్ నెస్ తెలియజేయడానికి. పోలవరం ప్రాజెక్ట్ కీలక దశ నిర్మాణం పనులు జరుగుతున్న ఈ సమయంలో టెండర్ పనులు ఆపేయాలంటూ పిడుగులాంటి లేఖ కేంద్రం నుంచి వచ్చి బాబు నెత్తిన పడింది. కీలక దశ పనులు జరుగుతున్న సమయంలో లేఖ ఎందుకొచ్చింది ? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడే అడ్డంకులు సృష్టించాలని ఎందుకు భావిస్తోంది ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియన చంటి పిల్లాడు కాదు చంద్రబాబు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాజకీయాల్లో అపర చాణుక్యుడుగా పేరుగాంచిన చంద్రబాబుకు కేంద్రంలోని బీజేపీ మైండ్ లో ఏముందో తెలుసు కనుకే తొలిసారి పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఏదో గాలికి కొట్టుకొచ్చిన ఆకాశ రామన్న లేఖ అయితే చంద్రబాబు అంత సీరియస్ గా తీసుకునే వారు కాదు. వచ్చే ఏడాది ఒరిస్సా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకాస్త దూరంలోనే ఎపి తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయి. ఒరిస్సా పోలవరం ప్రాజెక్ట్ ని ఏస్థాయిలో వ్యతిరేకిస్తోందో అందరికి తెలిసిందే. అక్కడ నెగ్గుకురావడం కోసం పోలవరం ప్రాజెక్ట్ కి అడ్డంకులు సృష్టిస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఈ ఎత్తుగడ వెనుక ఇంకో వర్షన్ కూడా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలని అంత తేలికగా చంద్రబాబు వదలి పెట్టరు. ఇక జగన్ తన వ్యక్తిగత సమస్యలతో లాక్ అయిపోయి కేంద్రంపై నోరెత్తే పరిస్థితిలో లేరు. ఆ రెండు పార్టీలని ఇబ్బందుల్లోకి నెడితే రాజకీయంగా బిజెపి లాభం అనే విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి.

పోలవరం ప్రాజెక్ట్ వ్యయాన్ని అమాంతం 58 వేల కోట్లకు పెంచడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని గట్టిగా నిలదీస్తున్న బిజెపి నేతలు, ఆర్థిక లోటు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి, వైజాగ్ రైల్వే జోను, ఇంకా అప్పుడెప్పుడో మంజూరు చేసి పెండింగ్ లో పెట్టేసిన ప్రాజెక్టుల మాటెత్తితే మాత్రం గప్ చుప్ అయిపోతున్నారు. ఇలాంటి ఎదురుతిరిగే ధోరణే అవలంభిస్తే జైలుకు సైతం వెళ్లాల్సి వస్తుందని బిజెపి నేత రఘునాథ బాబు లాంటి వారు వ్యాఖ్యలు చేస్తుంటే.. చంద్రబాబు అంత తేలిగ్గా లోంగే రకం కాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేసారు.

Comments