ప్రచురణ తేదీ : Jul 31, 2018 1:47 AM IST

టీడీపీకి బీజేపీ నేత సభాహక్కుల ఉల్లంఘన నోటీసు!

గత కొద్దిరోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీల విషయమై జరుగుతున్న వివాదం రోజురోజుకు తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే పలురకాలుగా మాటల యుద్ధంతో బీజేపీ మరియు టిడిపిలు ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. ఓవైపు ఏపీకి ఇచ్చిన హామీల్లో చాలావరకు కూడా అమలుపరిచామని, ఎక్కడో అక్కడక్కడా తప్ప దాదాపుగా అన్ని నెరవేర్చమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు టీడీపీ మాత్రం కేంద్రం వారు పిసరంత ఇచ్చి కొండంత ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ విషయమై అటు లోక్ సభలో అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ, సభలో కావలసినంతమంది సభ్యుల మద్దతు లేకపోవడంతో అది వీగిపోయింది. ఇక ఆ తరువాతి రోజునుండి అటు రాజ్యసభలోను ఇవే అంశాలపై వాడి వేడి చర్చలు జరిగాయి.

అయితే ఆ సమయంలో రాజ్యసభలో చర్చ అనంతరం తనపై టిడిపి నేతలు ఆగ్రహించి బెదిరింపులకు గురిచేశారని, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వారిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అంతే కాక ఆ సమయంలో జరిగిన వివాదం తాలూకు వీడియోలను కూడా ఆయన రాజ్యసభ సెక్రెటేరియేట్ కు సమర్పించినట్లు తెలిపారు. టీడీపీ వారు సభలో వ్యవహరిస్తున్న కుట్రపూరిత విధానంపై తాను నిరసన వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా టీడీపీ ఎంపీలు తనపై పలురకాలుగా బెదిరింపులకు దిగారని ఆయన ఆరోపిస్తున్నారు. కావున వారిపై తగు చర్యలు తీసుకోవలసిందిగా అయన రాజ్య సభ చైర్మన్ ను ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది…..

Comments