ఆరుషి మర్డర్ మిస్టరీ: తల్లిదండ్రులు చంపలేదు..మరి ఎవరు చంపారు?

నిజమనేది ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు అంటారు. కానీ ఎన్నో నేర చరిత్రలు ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలాయి. అదే తరహాలో మరో రెండు హత్యలు కూడా ప్రశ్నార్థకంగా మిగిలాయి. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం దేశంలోనే సంచలనం సృష్టించిన ఆరుషిని మరియు ఆమె ఇంట్లో పనిచేసే హేమరాజ్ హత్య కేసుపై గురువారం అలహాబాద్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. 2013లో 14 ఏళ్ల కూతురిని తల్లిదండ్రులే చంపేశారని ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో సిబిఐ కోర్టు వారికి జీవిత ఖైదు శిక్షను విధించింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆరుషి తల్లిదండ్రులు నుపుర్‌, రాకేష్‌ అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించారు.

అయితే అలహాబాద్ కోర్టు తల్లిదండ్రులు నుపుర్‌, రాకేష్‌ లను బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నిర్దోషులుగా ప్రకటించింది. సరైన ఆధారాలు లేనందువల్ల వారిద్దరిని నిర్దోషులుగా ఈ రోజు కోర్టు ప్రకటించింది. 2008, మే 15న ఆరుషి నొయిడాలోని ఆమె ఇంట్లోనే హత్యకు గురైంది. ఆ మరుసటి రోజు వారి ఇంట్లో పనిచేసే హేమరాజ్ కూడా ఇంటిపైన శవంగా కనిపించాడు. ఆరుషి – హేమరాజ్ ఇద్దరు సాన్నిహిత్యంగా ఉండడం చూసి తల్లి దండ్రులే ఆ హత్యలను చేశారని విచారణ చేపట్టిన సిబిఐ తెలిపింది. ఆ హత్యలు ఎలా జరిగాయో తమకు తెలియదని నుపుర్‌, రాకేష్‌ దంపతులు చాలా మొత్తుకున్నారు. కానీ వారికి శిక్ష పడింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ అవ్వడంతో మరి ఆ హత్యలు ఎవరు చేశారు అనే విషయం మరోసారి ప్రశ్నగా మారిపోయింది.

Comments