ప్రచురణ తేదీ : Jan 11, 2018 11:37 AM IST

ప్రత్యేక ప్యాకేజీ నిధుల విడుదల పై కేంద్రానికి చంద్రబాబు లేఖ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రికి రాష్ట్రానికి రావలసిన నిధుల విడుదలపై ఒక లేఖ రాశారు. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి కేంద్రానికి నిధుల విడుదలపై లేఖలు రాయడం మామూలు విషయమే అని సరిపెట్టుకోవచ్చు. అయితే ఈ లేఖ ఆద్యంతం బాబు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసే చందంగా సాగిందని సమాచారం. గత ఎన్నికల్లో బిజెపి తో మైత్రి బంధం పెట్టుకున్న బాబు, ఎప్పుడూ సహచర మిత్రులపై మాట తూలకుండా సంయమనం తో వ్యవహరిస్తూ సొంత పార్టీవారిని కూడా బిజెపి పై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరిస్తుంటారు. అసలు విషయం ఏంటంటే మీరు మాకు అన్యాయం చేస్తున్నారు అనే మాటని ఆయన సూటిగా వాడకుండా అలాంటి అర్ధమే వచ్చేలా లేఖలో రాసారని అంటున్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు రావలసింది వాస్తవమే, ఒక అనాధ వలే ఏర్పడిన రాష్ట్రం కనుక ప్రతి చిన్న విషయాన్ని ఇతర రాష్ట్రాలతో ముడి పెట్టకుండా ఉదారంగా వ్యవహరించి సాయం అందిస్తేతప్ప ఇప్పుడున్న పరిస్థితుల నుండి బయట పడే అవకాశం లేదని రాసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ నిధుల విషయం కొన్ని రోజుల క్రిందట ప్రస్తావనకు వచ్చి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే అంశం పై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఇప్పించవలసిన నిధుల పై విదేశీ సంస్థలతో సమాలోచనలు జరుపుతున్నామని, ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి , సాధ్యమయినంత త్వరగా సాయం అందిస్తామని అన్నారు. అయితే ఆయన మాటలు కర్ర విరగ కుండా పాము చావకుండా మాట్లాడినట్లు అనిపిస్తోందని పలువురు అంటున్నారు. నిన్న దీనికి ప్రతిగా చంద్రబాబు రాసిన లేఖలో ప్రముఖంగా మాకు ఋణం కాదు, నాబార్డు ద్వారా గ్రాంటు ఇప్పించండి అంటూ లేఖ ద్వారా వేడుకున్నారు. నిజానికి రుణానికి, గ్రాంటుకు చాలా తేడా వుంది అని, గ్రాంటు రూపంలో నిధులు వస్తే అవి తిరిగి చెల్లించే అవసరం ఉండదు కాబట్టి చంద్రబాబు గట్టిగా గ్రాంటు ఇప్పించమని అడుగుతున్నట్లు చెపుతున్నారు. లేఖ తయారీ తర్వాత, దానిని పూర్తిగా చదివి చివరిగా సంతకం చేసిన ముఖ్యమంత్రికి అయినా తను చేసిన పొరపాటు తనకు గుర్తుకు వచ్చిందో లేదో అని ప్రశ్నిస్తున్నారు. ఒకనాడు ప్రత్యేకహోదా అంశాన్ని చంద్రబాబు గట్టిగ పట్టుకుని తనవంతుగా కేంద్రం పై వత్తిడి తెచ్చి హోదా సాధించి ఉన్నట్లయితే రాష్ట్రానికి ఇప్ప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని, అప్పుడు ఇలా అడుక్కోవలసిన పనిలేకుండా ఆటోమేటిక్ గా నిధులన్నీ గ్రాంట్ల రూపంలో వచ్చేవని, కానీ చంద్రబాబు ఏ కారణంతో ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి ప్యాకేజి తీసుకున్నారో ఆయనకే తెలియాలని పలువురు అంటున్నారు. ప్రతిపక్ష నాయాకులు హోదా పై మాట్లాడుతుంటే అది ముగిసిపోయిన అంశం దాని గురించి ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని ప్రజల్లో వున్న హోదా స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసిన పాపం ఆయనదే అని చెప్పుకుంటున్నారు.

Comments