నగరంలో మరో అతిపెద్ద ఐటీ కారిడార్..

ఐటీ రంగం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడే ఉద్యోగాలు, టెక్నాలజీ, పెద్ద కొత్త కంపనీలకు పునాది పడుతుంది. భారతదేశ ఐటీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కారిడార్ ఏర్పాటుకానున్నది. నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లాలో ఈ సారి మూడు కొత్త ఐటీ పార్కులు రానున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బుద్వేల్, కోకాపేట్, పుప్పాల్‌గూడలో నూతనంగా ఐటీ క్లస్టర్లను ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రతిపాదికు సృష్టించింది. ప్రస్తుతం సైబరాబాద్‌లో ప్రధానంగా కేంద్రీకృతమైన ఐటీ కారిడార్‌కు సమాంతరంగా బుద్వేల్ నుంచి తెల్లాపూర్‌మీదుగా కొల్లూరు వరకు అతి పెద్ద ఐటీ కారిడార్‌ను అభివృద్ధి చేయడానికి సిద్దం చేయనున్నారు.

ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం సంబంధిత శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించగా, ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం రఘునందన్‌రావు, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈ వెంకట నర్సింహారెడ్డి, సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. నగర శివార్లలో ప్రతిపాదిత ఐటీ క్లస్టర్ల ఏర్పాటుకు గుర్తించిన భూములను వెంటనే టీఎస్‌ఐఐసీకి స్వాధీనపర్చే చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పుప్పాల్‌గూడలో ఐటీ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదించిన 196 ఎకరాల అవాక్యూ ప్రాపర్టీస్ భూములపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సూచించారు. బుద్వేల్‌లో ఐటీ పార్కు కోసం ఎంపికచేసిన 300 ఎకరాల భూములను సత్వరమే టీఎస్‌ఐఐసీకి బదలాయించాలని ఆదేశించారు. కోకాపేటలోని 250 ఎకరాల హెచ్‌ఎండీఏ భూములపై సుప్రీంకోర్టులో గత కొద్దికాలంగా మగ్గుతున్న కేసు పరిష్కారమైనందున ఆ భూములను ఐటీ క్లస్టర్‌కు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ ప్రతిపాదనలమేరకు పట్టణ శివార్లలో ఐటీ క్లస్టర్ల అభివృద్ధిపై సంబంధితశాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేసారు. భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్న ఐటీ కంపెనీలకు అనువైన భూముల సేకరణపై దృష్టి సారించారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్, పుప్పాల్‌గూడ, గండిపేట మండలం కోకాపేట, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఉస్మాన్‌నగర్, కొల్లూరులో ఐటీ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఈ మధ్యలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర్లో ఉన్న సంగారెడ్డిజిల్లా తెల్లాపూర్‌లో ఉన్న ప్రభుత్వ భూములను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. బుద్వేల్‌లో ఐటీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఇక్కడ 300 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నందున వాటిని టీఎస్‌ఐఐసీకి బదలాయించే పనులు కూడా వేగవంతం అయ్యాయి. ఇక్కడ సైబరాబాద్ ఐటీ హబ్‌కు దీటుగా అన్ని హంగులతో ఐటీ పార్కును అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించడం విశ్లేషకరం. పుప్పాల్‌గూడలో 196 ఎకరాలు, కోకాపేటలో 250, కొల్లూరులో 270, ఉస్మాన్‌నగర్‌లో 80 ఎకరాలను ఐటీ క్లస్టర్ల ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రతిపాదిత భూములను త్వరితగతిన టీఎస్‌ఐఐసీ స్వాధీనం చేసుకొని లేఅవుట్‌తో పాటు ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువైన అప్రోచ్ రోడ్లు, డ్రైనేజ్ కాల్వలు, విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించనుంది. ఇక అతి త్వరలోనే కొత్తగా రాబోతున్న ఈ 3 ఐటీ కారిడార్ల నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగావకాశాలు, కొత్త కంపనీల ఏర్పాటుకు నాంది పలకబోతుంది.

Comments