కేసీఆర్ ఫ్రంట్ కు సర్వం సిద్ధం!

తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుతం జాతీయ రాజకీయాల పై దృష్టిపెట్టినట్లు కనపడుతోంది. అందుకోసం జాతీయస్థాయిలో ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు త్లెలుస్తోంది. అటువంటి బలమైన ప్రజాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. అయితే ఇటీవల అందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మద్దతు పలికారు. తదుపరి చర్చల్లో భాగంగా ఈనెల 19న సీఎం కేసీఆర్ కోల్ కత్తా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశం కానున్నారు. థర్డ్ ఫ్రంట్ పై మమతతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. థర్డ్ ఫ్రంట్ పై మమత సూచనలను ఆయన పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఇదిలాఉండగా, దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోవైపు ప్రకటించారు. రాబోయే ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించనున్నాయని ఇందులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాన భూమిక పోషించనున్నారని అన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం నేత హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు.కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడే మూడో ఫ్రంట్ కు మద్దతు ఇస్తానని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో కొత్త రక్తం రావాలంటే థర్డ్ ఫ్రంట్ అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా తృతీయ ప్రత్యామ్నాయం ఆవశ్యకతను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ముందుకు వెళుతూ దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ కు రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీల మద్దతు ఏమేరకు లభిస్తుందో వేచి చూడాలి….

Comments