ప్రచురణ తేదీ : Sat, Apr 21st, 2018

తెలంగాణాకు ఎయిమ్స్…

రాష్ట్రప్రభుత్వం చేసిన సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, టీఆర్ఎస్ ఎంపీల కృషికి ఫలితం దక్కింది. రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞానశాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి అందాయి. ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన రూ.3400 కోట్లు కేటాయించిన కేంద్ర ఆర్థికశాఖ.. భూసేకరణ ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పనకోసం (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగం, న్యాక్) సంస్థలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రెండేండ్లక్రితమే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించినా.. నిధుల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన విషయాల్లో అనుమతులపై కేంద్ర ఆర్థికశాఖ జాప్యంచేసింది. దీంతో ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఎయిమ్స్‌కు అనుమతులు ఇవ్వాలని కోరారు. దానికితోడు టీఆర్ఎస్ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బోయినపల్లి వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్ తదితరులు పార్లమెంటు వేదికగా తెలంగాణకు ఎయిమ్స్‌కోసం పోరాటంచేశారు. పార్లమెంటు వెలుపల కూడా కేంద్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఎయిమ్స్‌ను సాధించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి ఐదుసార్లు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తదితరులను లకా్ష్మరెడ్డి పలుసార్లు కలిసి విన్నవించారు. అన్నిరకాల ప్రయత్నాలు ఫలించి.. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. బీబీనగర్లో ఎయిమ్స్ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భావించింది. ప్రస్తుతం రాజధానిలో నాలుగైదుచోట్ల స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత భూసేకరణ ఫైల్ వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. దీనిని త్వరలో సీఎం కేసీఆర్‌కు పంపుతారని సమాచారం. సీఎం ఆమోదంతో భూసేకరణ, స్థలాన్ని ఖరారు చేయనున్నారు.

Comments