ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

రోజాకు పోటీగా వాణివిశ్వనాథ్..నగిరి నుంచే బరిలోకి..!

అలనాటి నటి వాణివిశ్వనాథ్ పొలిటికల్ ఎంట్రీ దాదాపుగా ఖరారైంది. తాను టిడిపి లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆమె తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తనకు తెలుగు దేశం పార్టీ నుంచి పిలుపందిందని వాణివిశ్వనాథ్ తెలిపారు. వాణివిశ్వనాథ్ టీడీపీలో చేరబోతున్నట్లు ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఆ వార్తలు నిజమని తాజాగా తేలింది. తెలుగు దేశం పార్టీలో రాముడి లాంటి పాలన ఉందని వాణివిశ్వనాథ్ అన్నారు. తన కు చంద్రబాబు నాయకత్వం అంటే చాలా ఇష్టమని త్వరలోనే ఆయన్ని కలుస్తానని ప్రకటించారు.

ప్రజల కష్టాలలో పాలు పంచుకునేందుకు రాజకీయాల్లో రాణించాలని ఉందని వాణి విశ్వనాథ్ అన్నారు. అందుకోసం చంద్రబాబు ఆదేశిస్తే నగిరి నుంచి రాజకీయ ఓనమాలు దిద్దుతానని తెలిపారు.నగిరి నియోజకవర్గానికి సినీనటి రోజా వైసిపి తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రోజా నటిగా తనకు ఇష్టమని వాణి విశ్వనాథ్ తెలిపారు. తాజాగా వాణివిశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో సరికొత్త పొలిటికల్ హీట్ పెరిగింది. ఫైర్ బ్రాండ్ గా వైసిపి తరుపున టీడీపీ నేతలపై రోజా విమర్శల దాడి గురించి తెలిసిందే. రోజాకు చెక్ పెట్టేందుకే చంద్రబాబు వాణి విశ్వనాథ్ ని రంగంలోకి దించుతున్నట్లు టిడిపి వర్గాలు అంటున్నాయి. వాణివిశ్వనాథ్ పుట్టి పెరిగింది చెన్నైలో. కాగా ఆమె ఏపీ రాజకీయాల్లో ఎలా రాణిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది.

Comments