ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

‘ఖైదీ నెంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హైలైట్ అయ్యింది ఎవరు…?

rgv-naga-babu
దాదాపుగా 10 సంవత్సరాల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం’ఖైదీ నెంబర్ 150′ ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది. తన 150వ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిరంజీవి ఆ సినిమా కోసం ఎన్నో కథలను విన్నారు. ఎంతో మంది దర్శకులను అనుకున్నారు. కానీ ఆయన విన్న కథలేవీ ఆయనకు సంతృప్తి కలిగించలేదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా ఓకే అయిపోయింది అనుకున్న తరుణంలో ఆ కథను, దర్శకుడిని కూడా చిరంజీవి పక్కన పెట్టారు. చివరికి ఆయన తమిళంలో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన ‘కత్తి’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం వెలువడిన తరువాత ప్రతిరోజూ ఈ సినిమా గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది. దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే సగం విజయం సాధించిందని చిరంజీవి అభిమానులు సంబరపడ్డారు.

ఈ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీ కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది. బాలకృష్ణ కెరీర్లో 100వ సినిమాను క్రిష్ చాలా ఛాలెంజ్ గా తీసుకుని అతి తక్కువ వ్యవధిలో ఏ మాత్రం క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఈ సినిమా తెరకెక్కించి అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. దీంతోపాటు క్రిష్ విడుదల చేసిన ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో అటు చిరంజీవి అభిమానులు, ఇటు బాలయ్య అభిమానులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటూ హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ కూడా మా మధ్య ఎటువంటి పోటీ లేదని, సంక్రాంతికి విడుదల అయ్యే ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయినా అభిమానులు మాత్రం తగ్గట్లేదు.

ఈ నేపథ్యంలో జనవరి 7వ తారీఖున గుంటూరు హాయ్ ల్యాండ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో మెగా సోదరుడు నాగేంద్రబాబు చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం సృష్ఠ్టించాయి. దీంతో అందరూ ఈ ఫంక్షన్ గురించి మాట్లాడుకోవడం మానేసి నాగబాబు చేసిన వ్యాఖ్యల గురించే చర్చించుకోవడం ఆ సినిమా టీం ను కొంచెం కంగారు పెడుతుంది. ఈ ఫంక్షన్ లో నాగేంద్రబాబు ప్రముఖ రచయిత అయిన యండమూరి వీరేంద్రనాధ్ పైనా, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పైనా వారి పేర్లు ప్రస్తావించకుండా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై యండమూరి వీరేంద్రనాథ్ పెద్దగా స్పందించకపోయినా, రాంగోపాల్ వర్మ మాత్రం తన ట్వీట్లతో నాగేంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. దీంతో అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ గురించి మాట్లాడుకోవడం మానేసి, నాగేంద్రబాబు వ్యాఖ్యల గురించి, తరువాత రాంగోపాల్ వర్మ చేస్తున్న ట్వీట్ల గురించి మాట్లాడుకోవడంతో అసలు విషయం మరుగున పడిపోయింది.

Comments