ప్రచురణ తేదీ : Dec 30, 2016 3:49 AM IST

డిసెంబరు 31 రాత్రి 8 గంటలకు మోడీ ఏం చెప్పబోతున్నారు…?

modi1
మోడీ..మోడీ..మోడీ.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. ఆయన ప్రధానమంత్రి కావడమే ఒక సంచలనం. తాను ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా ఉన్న నల్లధనాన్ని వెలికి తీస్తానని వాగ్దానం చేసి ఆయన పదవిలోకి వచ్చారు. ఆయన ప్రధాన మంత్రి అయ్యాక ‘స్వచ్ఛ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ లాంటి ఎన్నో చెప్పుకోదగ్గ కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు. అయితే ఆయన ప్రధాన మంత్రి అయ్యి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఆయన వాగ్దానం చేసినట్టు నల్లధనంపై పెద్దగా చర్యలేమి తీసుకోలేదు. కానీ నవంబర్ 8 రాత్రి ఎనిమిది గంటలకు ఎవరూ ఊహించని విధంగా ఒక సభ పెట్టి ఆ రోజు రాత్రి 12 గంటల నుండి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని ప్రకటించారు. దేశ ప్రజలందరూ మోడీ ఇచ్చిన షాక్ నుండి తేరుకునే లోపే 500, 1000 రూపాయల నోట్లు దేశంలో ఎక్కడా చెల్లకుండా పోయాయి. 500,1000 రూపాయల నోట్లు ఎవరి దగ్గరైన ఉంటె బ్యాంకులలో డిసెంబర్ 31 వరకు జమ చేసుకోవచ్చని మోడీ చెప్పారు. ఈ నిర్ణయంతో దేశంలో ఉన్న నల్లబాబులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. తమ దగ్గర ఉన్న కోట్ల కొద్దీ నల్ల ధనాన్ని ఏం చేయాలో తెలీక తలలు పట్టుకున్నారు. ప్రజలందరూ మోడీ నిర్ణయం అద్భుతమైందని, ఇంకెవరూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరని ఆయనను పొగిడారు.

అయితే ఆ తరువాత రోజు నుండే దేశవ్యాప్తంగా ప్రజలు విపరీతమైన నగదు కొరతను ఎదుర్కొన్నారు. ప్రజలందరూ బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నగదు కోసం బారులు తీరారు. ప్రజలు కూడా మోడీ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా కొన్ని రోజులు కష్టాలు పడడానికి సిద్ధం అన్నట్టుగా క్యూలలో నిల్చున్నారు. మోడీకి ప్రజల నుండి వచ్చిన మద్దతు చూసి ఆశ్చర్యపోయిన ప్రతిపక్షాలు ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ప్రజల దృష్టిలో చులకన అవుతాము అని భావించి మొదట్లో మోడీ నిర్ణయాన్ని సమర్దిస్తున్నట్టుగానే మాట్లాడాయి. కానీ రోజులు గడుస్తున్నా నగదు కోసం ప్రజలు పడుతున్న కష్టాలు తీరడంలేదు సరికదా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. తాను తీసుకున్న నిర్ణయంతో ప్రజలు పడుతున్న అవస్థను చూసిన ప్రధాని మళ్ళీ మీడియా ముందుకొచ్చి తనకు ఒక 50 రోజులు సమయం ఇవ్వమని, 50 రోజుల తరువాత అంతా సర్దుకుంటుందని ప్రజలు కోరారు. అయినా ప్రజల్లో అసహనం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. మొదట్లో మోడీ నిర్ణయాన్ని భేష్ అన్నవాళ్ళే ఇప్పుడు మోడీ ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ప్రజలలో పెరిగిపోతున్న అసహనాన్ని చూసిన ప్రతిపక్ష పార్టీలకు ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చింది. అప్పటి వరకు ప్రజలు మోడీ నిర్ణయాన్ని సమర్దించడంతో ఏం చేయలేకపోయిన ప్రతిపక్షాలు ప్రజల అసహనాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాయి. దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేఖ పార్టీలన్నీ ఒక్కతాటి పైకి వచ్చి మోడీ తీసుకున్న నిర్ణయంపై విమర్శల వర్షం గుప్పిస్తున్నాయి.

మోడీ దేశప్రజలను అడిగిన 50 రోజుల గడువు నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ డిసెంబర్ 31 రాత్రి 8 గంటలకు ఒక సభ పెట్టి పెద్దనోట్ల రద్దుపై ప్రసంగించనున్నారు. ఇప్పుడు దేశ ప్రజలందరూ అసలు ఆ రోజు మోడీ ఏం చెప్పబోతున్నారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తారా..? లేదంటే మళ్ళీ సంచలన నిర్ణయాలు ఏమైనా తీసుకోబోతున్నారు..?అసలు ఆయన ఏం చెప్పబోతారు. మోడీపై ఇప్పటికీ మెజారిటీ ప్రజలు నమ్మకంగానే ఉన్నారు. మరి దేశ ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకాన్ని మోడీ నిలబెట్టుకుంటారా..? కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు ఆయన ఏం చెప్తారు..? మోడీ నిజంగానే పులి మీద స్వారీ చేస్తున్నారా..? తానూ కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే డిసెంబర్ 31 రాత్రి 8 గంటల వరకు వేచి చూడాల్సిందే

Comments