ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మ‌కం.. ఈసారైనా న్యాయం జ‌రిగేనా?

అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేస్తున్నారుట‌. అవి అమ్మి సామాన్యుల డిపాజిట్ల‌ను తిరిగి చెల్లిస్తారుట‌. ప్ర‌స్తుతం ఏపీ వ్యాప్తంగా సాగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. ఈరోజు టీవీ చానెళ్ల స్క్రోలింగులు చూసిన ఏజెంట్లు అంతా ఒక‌టే ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌నైనా త‌మ మెడ‌కు ఉరితాళ్లు కొనుక్కునే అవ‌స‌రం లేకుండా పోతుందేమోన‌న్న ఓ ఆశ‌. అగ్రిగోల్డ్‌కి చెందిన ఆస్తుల అమ్మ‌కానికి అధికార తేదేపానే మోకాల‌డ్డుతోంద‌న్న విమ‌ర్శ‌లు ఎప్ప‌టినుంచో వున్నాయి. ఆస్తుల అమ్మ‌కం .. వేలంలో ముంద‌డుగు ప‌డ‌కుండా బడా రాజ‌కీయ నేత‌లే అడ్డు త‌గులుతున్నార‌ని ఆరోపిస్తూ అప్ప‌ట్లో బాధిత ఏజెంట్లు, డిపాజిట్ దార్లు రోడ్డుకెక్కారు. అప్ప‌ట్లో ఆస్తులు అమ్మ‌కంపై చంద్రబాబు సైతం దిగొచ్చి హామీ ఇవ్వాల్సొచ్చింది. ప్రాసెస్ జ‌రుగుతోంది. కాస్త ఆగాలి అని సీఎం స‌ర్ది చెప్పారు. మొత్తానికి ఆ ప్ర‌క్రియ మొద‌లైన‌ట్టే క‌నిపిస్తోంది.

అగ్రిగోల్డ్ కి కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆస్తులు, భూములు ఉన్నాయి. వాట‌న్నిటినీ అమ్మేస్తే డిపాజిట‌ర్ల‌కు చెల్లించ‌గా ఇంకా మిగుళ్లు కూడా ఉంటాయ‌ని చెబుతున్నారు. గుంటూరు, నూజివీడు త‌దిత‌ర చోట్ల అగ్రి గోల్డ్ ఆస్తులు విరివిగా ఉన్నాయి. ముందుగా నూజివీడు స‌హా మొత్తం 12 చోట్ల ఉన్న అగ్రి ఆస్తుల్ని అమ్మ‌కానికి పెట్టారు. వేలానికి సంబంధించిన ధ‌ర‌కాస్తుల గ‌డువు ఈరోజేన‌ని టీవీల్లో స్క్రోలింగులు వేశారు. అవి అమ్మేస్తే మ‌రి అకౌంట్లోకి వ‌చ్చిన సొమ్ముల్ని మ‌ధ్య‌లో దొంగ‌లు బొక్కేయ‌కుండా నేరుగా ఏజెంట్ల ద్వారా డిపాజిట‌ర్ల‌కు చెల్లిస్తారా? అస‌లు ఈ ప్ర‌క్రియ ఎలా సాగ‌నుంది? ఇప్ప‌టికైనా డిపాజిట‌ర్ల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఏజెంట్ల‌ను బ‌త‌క‌నిస్తారా? ఆ ప‌ని ప్ర‌భుత్వం నిజాయితీగానే చేస్తోందా? ఇలా ఎన్నో వేన‌వేల ప్ర‌శ్న‌లు. మ‌రి వీట‌న్నిటికీ స‌మాధానం ప్రాక్టిక‌ల్‌గానే ప్ర‌భుత్వం చెబుతుందేమో చూడాలి. లేదంటే వేల కోట్ల కుటుంబాలు రోడ్డెక్క‌డం, బ‌జారున ప‌డ‌డం ఖాయం. ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఉరితాళ్లు కొనుక్కోవ‌డం గ్యారెంటీ.

Comments