ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

ఎడ మొహం.. పెడ మొహం.. అయ్య‌న్న‌-గంటా తీరిది!!


ఏపీలో ఇద్ద‌రు సీనియ‌ర్‌ మంత్రులు.. ఆ ఇద్ద‌రూ అధికార తేదేపాలో చ‌క్రం తిప్ప‌డంలో ఘ‌నాపాటీలు. అందుకే ఆ ఇద్ద‌రికీ సీఎం చంద్ర‌బాబు ఎంతో ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. అయితే ఇటీవ‌లి కాలంలో ఆ ఇద్ద‌రిలో ఒక మంత్రిని చంద్ర‌బాబే స్వ‌యంగా దూరం పెట్టేస్తున్నార‌న్న ప్ర‌చారం సాగింది. ఇక స‌ద‌రు మంత్రివ‌ర్యులంటే వేరొక మంత్రికి అస్స‌లు పొస‌గ‌దు. విశాఖ‌లో వేల‌కోట్ల విలువ చేసే స‌ద‌రు మంత్రిగారి అక్ర‌మ భూదందా వ్య‌వ‌హారంపైనా ఏకంగా సీబీఐ-సీఐడీ రేంజ్ విచార‌ణ జ‌రిపించాల‌ని కో-మినిస్ట‌ర్‌ ప‌ట్టుప‌డుతున్నారు. అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రు మంత్రులు ఎవ‌రో ఈపాటికే మీకు అర్థ‌మై ఉంటుంది. ఇంకెవ‌రు?… ఒక‌రు గంటా శ్రీ‌నివాస‌రావు, మ‌రొక‌రు చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు. ఈ ఇద్ద‌రూ తేదేపా మంత్రులుగా ప్ర‌జాపాల‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రిమ‌ధ్యా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. `విశాఖ న‌గ‌రం`పై ప‌ట్టు విష‌యంలోనే ఆ ఇద్ద‌రిమ‌ధ్యా లాలూచీ అన్న సంగ‌తి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందుకే ఆ ఇరువురి మ‌ధ్యా అంత‌టి వైరం ఉందని చెబుతారు. అయినా పార్టీ కార్య‌క‌లాపాల్లో క‌ల‌వాల్సిన స‌న్నివేశం ఎలానూ ఉంటుంది. ఆ ఇద్ద‌రూ య‌ధృచ్ఛికంగానో, య‌థాలాపంగానో.. వైజాగ్‌ జ‌ర్న‌లిస్టుల‌ ఫోరం (విజెఎఫ్‌) నిర్వ‌హించిన జ‌ర్న‌లిస్ట్స్ అవార్డుల కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సొచ్చింది.

ఇంకేం ఉంది .. అక్క‌డ సీన్ చూడాలి. స‌ద‌రు మంత్రివ‌ర్యులు ఇరువురూ ప‌క్క‌ప‌క్క‌నే కూచున్నారు. కానీ ఉలుకు లేదు.. ప‌లుకు లేదు.. క‌నీసం స‌హ‌చ‌రుడి వైపు ఫార్మాల్టీస్ కోస‌మైనా చూసిన పాపాన పోలేదు. ప‌క్క‌నే కూచుని ఎటో మొహం తిప్పుకుని కూచోవ‌డం.. ఇబ్బంది ఫీల‌వ్వ‌డం.. జ‌ర్న‌లిస్టుల సాక్షిగా అక్క‌డ కంట‌ప‌డింది. ఒక‌రేమో ఫోన్‌తో కాల‌క్షేపం చేస్తే, ఇంకొక‌రేమో ఎటో చూస్తూ కాల‌క్షేపం చేసేశారు. ఓవైపు కెమ‌రా ఫ్లాష్‌లు, మ‌రోవైపు వేదిక‌పై జ‌ర్న‌లిస్టుల కార్య‌క్ర‌మం.. అయినా ఆ ఇద్ద‌రి మొహాల్లో ఇసుమంత వెలుగన్న‌దే క‌నిపించ‌లేదు. ముఖంలో రక్తం చుక్క‌యినా క‌నిపించ‌లేదే! ఆడిటోరియం డిమ్ లైట్ వెలుతురులోనూ.. మాడిన మొహాలు స్ప‌ష్టంగా గోచ‌రించాయి. అయితే వేదిక‌పై అవార్డులు పంచేందుకు పిలిచిన‌ప్పుడైనా మార‌తారా? అనుకుంటే.. సేమ్ సీన్ రిపీట్‌.. ఎవ‌రిమానాన వాళ్లు వేదిక‌నెక్కారు. వేదిక‌పైకి ఎక్కాక అయినా ప‌ల‌క‌రింపులు ఉన్నాయా? అంటే ప్చ్‌.. నో ఛాన్స్‌!! ప‌క్క‌ప‌క్క‌నే కూచునేందుకు మ‌హా ఇబ్బంది ప‌డిపోయారంటే న‌మ్మండి. ప‌క్క‌నే కూచున్నా ప‌క్క చూపులు త‌ప్ప స‌హ‌చ‌రుడి వైపు చూప‌న్న‌దే లేదు. ఈ ఇబ్బంది నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికా అన్న‌ట్టు అయ్య‌న్న పాత్రుడు లేచి ప‌క్క‌నే ఉన్న యాంక‌ర్ నుంచి మైక్ లాక్కుని.. మేమేదో విరోధులం అన్న‌ట్టు.. మ‌మ్మ‌ల్ని క‌లిపేందుకే ఈ జ‌ర్న‌లిస్టు వేదిక అన్న‌ట్టు ఉంద‌ని అనౌన్స్‌మెంట్ చేశారు. అప్ప‌టికే వేదిక కింద జ‌ర్న‌లిస్టు మిత్రులంతా.. ఆ ఇద్ద‌రినే అబ్జ‌ర్వ్ చేస్తూ వినోదాన్ని ఆస్వాధిస్తున్నారు. అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రూ మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరా? అంటూ జ‌ర్న‌లిస్టులంతా బెట్టింగులు పెట్టుకున్నారు. ఇండియా- పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీ (ఆ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైన‌ప్పుడే ఇదీ మొద‌లైందిగా) ఫైన‌ల్ మ్యాచ్ అంత ర‌స‌వ‌త్త‌రంగా సాగిందా ఎపిసోడ్‌. ప్చ్‌!!! ఎంజాయ్ చేసుకున్న‌వాడికి ఎంజాయ్ చేసినంత!!

Comments