ప్రచురణ తేదీ : Fri, Jun 16th, 2017

పాక్ కెప్టెన్ కేంద్రంగా.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఫిక్సింగ్ మరక..!

ఆదివారం చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాక్ లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో తలపడడానికి సిద్దమవుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిదశకు చేరుకున్న తరుణంలో పాక్ జట్టు కేంద్రంగా ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశం క్రికెట్ దేశాలలో చర్చనీయాంశంగా మారింది. మాజీ పాక్ క్రికెటర్ అమిర్ సోహైల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే పాక్, భారత్ జట్లు గ్రూప్ దశలో తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో పాక్ జట్టు టీం ఇండియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. దీనితో పాక్ పై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. సొంత మీడియానే పాక్ జట్టుని దుమ్మెత్తి పోసింది. అన్ని విభాగాల్లో కోహ్లీ సేన పాక్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీనితో పాక్ జట్టు కనీసం గ్రూప్ దశ దాటడం కష్టమని అందరూ అంచనాలు, ఊహాగానాలు మొదలుపెట్టారు.

కానీ పాకిస్థాన్ అనూహ్యంగా పుంజుకుంది. పాకిస్తాన్ క్రికెట్ టీం ఎప్పుడూ అంచనాలకు అందదని మరోసారి రుజువైంది. భారత్ తో పరాభవం తరువాత వరుస విజయాలు సాధించిన ఆ జట్టు ఫైనల్ చేరుకుంది. టోర్నీలో హాట్ ఫెవరెట్ గా భావించిన ఇంగ్లాండ్ ను సైతం పాక్ మట్టికరిపించిన వైనం అందరికి ఆశ్చర్యానికి గురిచేసింది. క్రికెట్ లో ఇలాంటి అనూహ్య పరిణామాలు సహజమే. కానీ పాక్ మాజీ క్రికెటర్ అమిర్ సోహైల్ వ్యక్తం చేస్తున్న డౌట్లు మాత్రం సంచలనం గా మారాయి. బయటి వ్యక్తుల వలనే పాక్ జట్టు విజయాలు సాధించిందని సోహైల్ అన్నారు. పాక్ విజయాలకు కారణం జట్టులో ఉన్నవారు కాదని ఆ విషయం కెప్టెన్ సర్ఫరాజ్ కు కూడా తెలుసనీ వ్యాఖ్యానించాడు.

మ్యాచ్ గెలిచిన అనంతరం తమ ఆటగాళ్ల కృషి వలన విజయం సాధించామని సర్ఫరాజ్ ఎప్పుడూ తెలపలేదు. బయట వారు ఎవరో సాయం చేస్తే గెలిచాం అన్న రీతిలో మాట్లాడుతూ వచ్చాడు. దీనిని బట్టి బయట ఏం జరిగిందో తాను ఊహించగలనని సోహైల్ సంచలన వ్యాఖ్యలు చేసారు.పాక్ జట్టు కృషికన్నా ప్రత్యర్థులు చేసిన తప్పిదాల వలనే ఆ జట్టు ఫైనల్ చేరింది. ఇకనైనా పాక్ జట్టుగా ఆడాలని సోహైల్ కోరాడు. ఈ వివాదాన్ని అటుంచితే ఆదివారం జారబోయే దాయాదుల సమరం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Comments