ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

ఎంటర్ టైనింగ్ మ్యాచ్ కు డేట్ ఫిక్స్ ..వైజాగ్ వేదికగా..!


వైజాగ్ లో బయటపడ్డ వేల ఎకరాల భూకుంభకోణం తెలుగుదేశంపార్టీని కుదిపేస్తోంది. ప్రతిపక్ష వైసీపీ ఈ స్కాంని పెద్ద ఆయుధంలా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వైజాగ్ ల్యాండ్ స్కాంలో పలువురి టిడిపి నేతల హస్తం ఉందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని బలంగా ప్రజల్లోకి తెలుసుకుని వెళ్ళడానికి ఆ పార్టీ జూన్ 22 న వైజాగ్ లో మహాధర్నా చేయబోతోంది. ఈ ధర్నా కు వైసిపి అధినేత జగన్ స్వయంగా హాజరు కానున్నారు. దీనికి తెలుగు దేశం ఆపార్టీ కౌంటర్ ని ప్లాన్ చేస్తోంది. అదే రోజున వైజాగ్ వేదికగా మహా సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుగుదేశంపార్టీ ప్రకటించడంతో రాజకీయంగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అధికార ప్రతిపక్షాలు ఒకే నగరంలో రెండు భారీ కార్యక్రమాలను చేపట్టనుండడంతో పోలీస్ లలో ఒత్తిడి నెలకొని ఉంది.

జూన్ 22 న నగరంలో ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మహాసంకల్పం కార్యక్రమాన్ని దాదాపు 5 వేల మంది కార్యకర్తలతో చేపట్టనుంది. మహా ధర్నాకు వైసిపి కూడా భారీగా మందిని పోగేసి పనిలో ఉంది. దీనితో అధికార ప్రతిపక్షాల మధ్య ఈ కార్యక్రమాలు ఎలాంటి పరిస్థికి దారితీస్తాయో అనే అనుమానం అందరిలో ఉంది. 2019 ఎన్నికలలో విశాఖ జిల్లా ఎంతటి కీలకం కానుందో ఈ రెండు పార్టీలు చేపడుతున్న కార్యక్రమాల్ని బట్టి అర్థమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం జగన్ వైజాగ్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన సందర్భంగా పోలీస్ లు అతనిని నగరంలోకిని అనుమతించలేదు. ఆ సందర్భంగా వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సారి పోలీస్ లు అడ్డుకుంటారా ? లేక మహా ధర్నాకు అనుమతిస్తారా అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో అత్యంత ఉత్కంఠకు దారితీస్తోంది.

దీనిపై వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే, టిడిపి నేత వాసుపల్లి గణేష్ మాట్లాడారు. వైసిపి మహా ధర్నా చేపడుతున్న జూన్ 22 నే మహాసంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. వైసిపి ప్రజల్లోకి తీసుకెళుతున్న అసత్యాలని అడ్డుకోవాల్సిన భాద్యత తమపై ఉందని అన్నారు. కాగా వైసిపి వైజాగ్ భూకుంభకోణంలో సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తోంది. దాదాపు 1000 కోట్ల విలువైన భూమిని తెలుగుదేశం కు చెందిన మంత్రులు ఆక్రమించారని వైసిపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. విశాఖ జిల్లా వైసిపి అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ టిడిపి చర్యని తప్పు బట్టారు. తెలుగు దేశం పార్టీ చేపడుతున్న మహా సంకల్పం కేవలం వైజాగ్ భూకుంభకోణాన్ని పక్కదారి పట్టించడానికే అని అన్నారు. తెలుగుదేశంపార్టీ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెనకాడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ధర్నా చేపట్టేందుకు అన్ని అనుమతులను పొందామని ఆయన అన్నారు.

భూములను కోల్పోయి ప్రజలు నిరాశలో ఉంటే తెలుగుదేశం పార్టీ,వైసిపిలు మరో రాజకీయ డ్రామాకు తెర తీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అధికార విపక్షాలు చేపడుతున్న ఆ రెండు కార్యక్రమాలు ఆరోజుకు మాత్రమే పరిమితమయ్యే హంగామాగా అభివర్ణిస్తున్నారు.

Comments