ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

ఈసారి ఆ నగరంపై జగన్ కన్ను పడిందిగా..?


గుంటూరు నగరం భవిష్యత్తులో అమరావతి రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది. ఈ నేపథ్యంలో రాజధానిపై రాజకీయ నేతల కన్ను పడకమానదు. గత సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా తెలుగు దేశం పార్టీ నేత గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరు స్థానాన్ని వదులుకోకూడదని జగన్ భావిస్తున్నాడట. అందుకోసం వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహ రచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గల్లా జయదేవ్ కు దీటుగా యువ నేతని గుంటూరులో జగన్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య తనయుడు కృష్ణ దేవరాయని వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి నిలబెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జగన్ అంటే తనకు అభిమానమని, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పోరాడతానని కృష్ణ దేవరాయ ఇదివరకటికే ప్రకటించాడు. ఈ మేరకు కృష్ణ దేవరాయ జిల్లాలో జరిగే పలు వైసిపి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. కాగా గుంటూరు స్థానంపై జగన్ ప్రత్యేక శ్రద్ద చూపడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు.

కాగా గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జగన్ విశాఖ నగరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా తన తల్లి విజయమ్మను నిలబెట్టాడు. విశాఖ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బిజెపి అభ్యర్థి హరిబాబు విజయమ్మను ఓడించిన విషయం తెలిసిందే.

Comments