ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసిన మోడీ..ఎవరబ్బా ఈ ‘రామ్ నాథ్’..?


అనేక చర్చోప చర్చల తరువాత ప్రధాని మోడీ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసారు. దళిత నాయకుడైన ప్రస్తుత బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ తమ రాష్ట్రపతి అభ్యర్థి అని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. అతిరధ మహా రథుల పేర్లు రాష్ట్రపతి అభ్యర్థులంటూ వినిపించాయి. కానీ చివరకు మోడీ దళిత నేత అయిన రామ్ నాథ్ కే జై కొట్టారు. బీజేపీలో దళిత నేతగా ఎదిగిన రామ్ నాథ్ ఉత్తరప్రదేశ్ నుంచి రెండు సార్లు రాజ్య సభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన గతంలో సుప్రీం కోర్టు, హై కోర్ట్ న్యాయమూర్తిగా కూడా పనిచేయడం విశేషం.

అనేక చర్చల తరువాత మోడీ రామ్ నాథ్ ని రాష్ట్ర పతి అభ్యర్థిగా ఖరారు చేశారని అమిత్ షా అన్నారు. విపక్షాలకు ఈ విషయాన్ని తెలియజేశామని రామ్ నాథ్ అభ్యర్థిత్వానికి వారు కూడా మద్దత్తు తెలుపుతారని ఆశిస్తున్నట్లు అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్ నాథ్ ఈ నెల 23 న నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లా, పరాంఖ్ గ్రామం రామ్ నాథ్ జన్మస్థానం. 1945 అక్టోబర్ 1 జన్మించిన ఆయన బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 1994 నుంచి 2006 వరకు ఆయన రాజ్య సభ సభ్యుడిగా సేవలందించారు. గతంలో రామ్ నాథ్ బిజెపి దళిత్ మోర్చా నాయకుడిగా కూడా పనిచేసారు. కాగా 2015 నుంచి బీహార్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఎల్ కె అద్వానీ, సుష్మాస్వరాజ్, మురళి మనోహర్ జోషి వంటి బిజెపి పెద్దల పేర్లు రాష్ట్రపతి రేసులో వినిపించగా చివరకు రామ్ నాథ్ ని ఖరారు చేయడం మోడీ తీసుకున్న అనూహ్య నిర్ణయమనే చెప్పాలి.

Comments